తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Farmers Protest : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి కష్టాలు, పంటలు ఎండిపోతున్నాయని రోడ్డెక్కిన రైతన్నలు

Karimnagar Farmers Protest : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి కష్టాలు, పంటలు ఎండిపోతున్నాయని రోడ్డెక్కిన రైతన్నలు

HT Telugu Desk HT Telugu

31 March 2024, 19:05 IST

google News
    • Karimnagar Farmers Protest : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకీ సాగు నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. పంటలు ఎండిపోతుండడంతో రైతులు సాగు నీటి కోసం రోడెక్కారు. రైతుల నిరసనకు బీఆర్ఎస్ నేతలు తోడైయ్యారు.
రోడ్డెక్కిన రైతన్నలు
రోడ్డెక్కిన రైతన్నలు

రోడ్డెక్కిన రైతన్నలు

Karimnagar Farmers Protest : తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీటి కష్టాలు(Water Crisis) రోజురోజుకు తీవ్రమౌతున్నాయి. వేసిన పంటలు ఎండిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఆందోళన(Farmers Protest)చెందుతున్నారు. సాగు నీటి కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల రైతులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా, రాస్తారోకోలతోపాటు నిరసన దీక్షలు చేపట్టారు.‌ కురిక్యాల సమీపంలోని వరద కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి సాగునీరు విడుదల చేసే వరకు కదలమని భీష్మించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

నీళ్ల లొల్లిలో పలువురు అరెస్టు

ఎస్సారెస్పీ వరద కాలువ(SRSP Flood Canal) నీటి కోసం రైతన్నలతోపాటు బీఆర్ఎస్(BRS) నాయకులు రాస్తారోకో చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం కురిక్యాల సమీపంలోని ఎస్సారెస్పీ వరద కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నీటి విడుదల చేసే వరకు కదలమని భీష్మించడంతో కరీంనగర్(Karimnagar), జగిత్యాల రూట్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు సర్దిచెప్పినా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు రైతులు వినకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ తో పాటు పలువురిని అరెస్టు చేసి బలవంతంగా స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని భావిస్తే... రైతులకు కన్నీరు తెచ్చే మార్పు వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో సాగు నీటికి కొరతలేకండా చేస్తే.. కాంగ్రెస్ వచ్చి మళ్లీ కరువు తెచ్చిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కారు(Revanth Reddy Govt) రైతులకిచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. చొప్పదండి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఫోన్ చేస్తే కనీసం లిఫ్టు కూడా చేయని ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని.. రైతుల పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రవిశంకర్ డిమాండ్ చేశారు.

పెద్దపల్లిలో 36 గంటల రైతు దీక్ష

పెద్దపల్లిలో బీఆర్ఎస్ 36 గంటల రైతు నిరసన దీక్ష(BRS Protest) చేపట్టింది. దీక్షకు మాజీమంత్రి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eswar) నాయకత్వం వహించారు. 36 గంటల దీక్షలో పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ లు పుట్ట మధుకర్, దావ వసంత, జక్కు శ్రీహర్షిణి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, దివాకర్ రావు పాల్గొన్నారు. సాగునీరు వెంటనే విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతుల రెండు లక్షల వరకు పంట రుణం తక్షణమే మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యాసంగిలో చేతికొచ్చిన పంటలు పాలకుల నిర్లక్ష్యంతో ఎండిపోతున్నాయని(Crop Damage), సాగు నీరందించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project) నుంచి వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, వ్యవసాయానికి కోతలు లేకుండా కరెంటు ఇవ్వాలని, రూ.2 లక్షల రుణ మాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలన్నారు.

గాడి తప్పిన కాంగ్రెస్ పాలన

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వంద రోజుల్లోనే గాడి తప్పిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులకు గత పదేళ్లలో ఎన్నడూ లేనన్ని కష్టాలు వచ్చిపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వందరోజుల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 138 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పొట్టదశకు చేరిన వరిపైరుకు అవసరమైన సాగునీరందించడంలో సర్కార్ దారుణంగా విఫలమైందని విమర్శించారు. రైతులు సాగునీటి కోసం పడుతున్న గోసను కళ్లారా చూసి వెంటనే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి బీఆర్ఎస్ బాసటగా నిలిచేందుకు 36 గంటల దీక్షకు దిగామని, ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

HT Correspondent K.Vijender Reddy, Karimnagar

తదుపరి వ్యాసం