తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Mla Kadiyam Srihari : కాంగ్రెస్ లో చేరిన Brs ఎమ్మెల్యే కడియం శ్రీహరి - వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్య..?

MLA Kadiyam Srihari : కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యే కడియం శ్రీహరి - వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్య..?

31 March 2024, 11:34 IST

google News
    • MLA Kadiyam Srihari Join in Congress : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్య కూడా కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి
కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి

కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి

MLA Kadiyam Srihari Join in Congress : లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం చేరగా… తాజాగా ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) కూడా హస్తం పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇక ఆయన కుమార్తె కడియం కావ్య(Kadiyam Kavya) కూడా హస్తం గూటికి చేరారు.

ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్…!

రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది. ఇందులో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను మార్చి 13వ తేదీన ప్రకటించింది. ఆ తరువాత పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న డాక్టర్ కడియం కవిత.. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా కలిశారు.ఇంతలోనే రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అభ్యర్థిగా ప్రకటించిన సరిగ్గా 15 రోజులకు 28వ తేదీన సాయంత్రం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ విడుదల చేశారు. కాగా ఈ హఠాత్పరిణామంతో ఓరుగల్లు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం చెలరేగింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరటంతో… ఆమెకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైన బీఆర్ఎస్.. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తే చేసింది. కడియం శ్రీహరి ఎప్పటి నుంచో తన కూతురుకు పొలిటికల్ ప్లాట్ ఫామ్ ఇవ్వాలని ఆలోచనతో పట్టుబట్టి మరీ కావ్యకు టికెట్ ఇప్పించి, తన పంతం నెగ్గించుకున్నారు. అప్పటికే టికెట్ పై ఆశలు పెట్టుకున్న కొంతమంది ఉద్యమకారులు ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చాలని పార్టీ అధినాయకులకు విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కూడా విన్నవించారు. పరిస్థితులను గమనించిన కడియం శ్రీహరి… కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారు. పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా… దీపాదాస్ మున్షితో పాటు పలువురు నేతలు కూడా కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కడియం… పార్టీ మార్పుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. నిన్న ఘన్ పూర్ లో తన అనుచరులతో సమావేశమైన కడియం(Kadiyam Srihari)… పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. కడియం కావ్యను అందరూ ఆదరించాలని కోరారు.

పార్టీ మార్పుపై ప్రకటన చేసిన కడియం శ్రీహరి… ఇవాళ అధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు సీఎం రేవంత్… ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంపీ అభ్యర్థులపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. మరో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో… వరంగల్ ఎంపీ స్థానం నుంచి కడియం కావ్య పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇలా కుదరకపోతే… కడియం శ్రీహరే పేరు ఖరారు కావొచ్చన్న లీకులు కూడా వస్తున్నాయి.

తదుపరి వ్యాసం