Kadiyam Kavya: వరంగల్‌లో కడియం కావ్య తప్పుకోడానికి కారణం ఏమిటి? టిక్కెట్ ఇచ్చినా ఫిరాయింపు దారిలోనే…-what was the reason for kadiyam kavya party defecting in warangal ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kadiyam Kavya: వరంగల్‌లో కడియం కావ్య తప్పుకోడానికి కారణం ఏమిటి? టిక్కెట్ ఇచ్చినా ఫిరాయింపు దారిలోనే…

Kadiyam Kavya: వరంగల్‌లో కడియం కావ్య తప్పుకోడానికి కారణం ఏమిటి? టిక్కెట్ ఇచ్చినా ఫిరాయింపు దారిలోనే…

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 06:25 AM IST

Kadiyam Kavya: పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీ కీలక నేతలుగా చెప్పుకునే లీడర్లు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతుండగా.. వరంగల్ అభ్యర్థిని ఖరారు చేసిన 15 రోజులకే పార్టీ కి మరో షాక్ తగిలింది.

బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన కడియం శ్రీహరి, కావ్య

Kadiyam Kavya: పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న వేళ బీఆర్ఎస్ BRS పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ కీలక నేతలుగా చెప్పుకునే లీడర్లు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతుండగా.. వరంగల్ అభ్యర్థిని ఖరారు చేసిన 15 రోజులకే పార్టీ కి మరో షాక్ తగిలింది.

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్ కడియం కావ్య.. గురువారం సాయంత్రం కేసీఆర్కు షాక్ ఇచ్చారు.  Warangal వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించినా తాను మాత్రం పోటీ చేయలేనంటూ లేఖ రాసి కలకలం రేపారు.

పోటీ నుంచి తప్పు కోవడంతో ఊరుకోకుండా గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్‌పై అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ లాంటి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని లేఖలో కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తోందని లేఖలో రాశారు.

ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకత్వం, పార్టీ కార్యకర్తలు తనను మన్నించాల్సిందిగా కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. కడియం కావ్య రిలీజ్ చేసిన లేఖ నిమిషాల్లోనే వైరల్ గా మారగా.. బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా కంగు తిన్నారు.

15 రోజుల్లోనే సీన్ రివర్స్

రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది. ఇందులో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను మార్చి 13వ తేదీన ప్రకటించింది. ఆ తరువాత పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న డాక్టర్ కడియం కవిత.. నాలుగు రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా కలిశారు.

ఇంతలోనే రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అభ్యర్థిగా ప్రకటించిన సరిగ్గా 15 రోజులకు 28వ తేదీన సాయంత్రం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ విడుదల చేశారు. కాగా ఈ హఠాత్పరిణామంతో ఓరుగల్లు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం చెలరేగింది.

కాంగ్రెస్ లోకి కడియం.. వరంగల్ అభ్యర్థిగా ఛాన్స్.!

బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించినా.. కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కడియం శ్రీహరి, తన కూతురు కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇది వరకే కడియం శ్రీహరిని కొందరు నేతలు కాంగ్రెస్ లోకి ఆహ్వానిచంగా.. అప్పట్లో ఆయన తిరస్కరించారు. కానీ ఆ తరువాత రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, లిక్కర్ స్కామ్, తదితర బాగోతాల నేపథ్యంలో కడియం మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయమే దిల్లీకి వెళ్లిన కడియం శ్రీహరి Kadiyam Srihari, కడియం కావ్య Kavya ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలను కలిసిన తరువాతే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ రిలీజ్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తండ్రీ, కూతురు ఇద్దరూ కాంగ్రెస్ Congress లో చేరిన తరువాత వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఒక వేళ కడియం శ్రీహరిని కాంగ్రెస్ Congress వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆయన స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ బై ఎలక్షన్స్ లో కడియం కావ్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ బరిలో నిలిపే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. గురువారం ఉదయం నుంచి దిల్లీలోనే ఉన్న కడియం శ్రీహరి, కడియం కావ్య సోనియాగాంధీ హామీతోనే హస్తం పార్టీలో చేరబోతున్నారని ఆ పార్టీ నేతల్లోనూ చర్చ జరుగుతోంది.

ఆ కారణంతోనే డ్రాప్?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైన బీఆర్ఎస్.. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తే చేసింది. కడియం శ్రీహరి ఎప్పటి నుంచో తన కూతురుకు పొలిటికల్ ప్లాట్ ఫామ్ ఇవ్వాలని ఆలోచనతో పట్టుబట్టి మరీ కావ్యకు టికెట్ ఇప్పించి, తన పంతం నెగ్గించుకున్నారు.

అప్పటికే టికెట్ పై ఆశలు పెట్టుకున్న కొంతమంది ఉద్యమకారులు ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చాలని పార్టీ అధినాయకులకు విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కూడా విన్నవించారు.

దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్, భూ కబ్జాలు, ఇతర అరాచకాల వల్ల బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, పార్టీలో సీనియర్ల మధ్య సఖ్యత లేకపోవడం, తన అభ్యర్థిత్వాన్ని ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కడియం కావ్య పార్టీ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కడియం శ్రీహరి అంతర్గతంగా పావులు కదిపి నేరుగా దిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం దిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలతో మరోసారి సమావేశం అనంతరం కడియం శ్రీహరి, కావ్య ఇద్దరూ హస్తం పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు దాదాపు రెండు నెలల ముందు నుంచే రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తుండగా.. మున్ముందు ఇంకెలాంటి షాక్ లు తగులుతాయో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం