తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Crime : తల మొండెం వేరు- డిప్లొమా విద్యార్థి అభిలాష్ కేసులో మిస్టరీ? హత్యా-ఆత్మహత్యా?

Karimnagar Crime : తల మొండెం వేరు- డిప్లొమా విద్యార్థి అభిలాష్ కేసులో మిస్టరీ? హత్యా-ఆత్మహత్యా?

HT Telugu Desk HT Telugu

03 April 2024, 21:31 IST

google News
    • Karimnagar Crime : కరీంనగర్ జిల్లాలో డిప్లొమా విద్యార్థి అభిలాష్ మృతి మిస్టరీగా మారింది. ముందు ఆత్మహత్యగా కాలేజీ యాజమాన్యం, పోలీసులు చెప్పినా...తల, మొండం వేరుకావడంతో...మరో కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డిప్లొమా విద్యార్థి అభిలాష్ మృతి మిస్టరీ
డిప్లొమా విద్యార్థి అభిలాష్ మృతి మిస్టరీ

డిప్లొమా విద్యార్థి అభిలాష్ మృతి మిస్టరీ

Karimnagar Crime : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా ఫస్టియర్ విద్యార్థి అభిలాష్ మృతి మిస్టరీగా మారింది. కళాశాల హాస్టల్ నుంచి అదృశ్యమైన అభిలాష్(Abhilash case) నెలరోజుల తర్వాత వ్యవసాయ బావిలో శవమై తేలడం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిలాష్ తల మొండెం వేరై బావిలో లభించడం వివాదాస్పదంగా మారి అందరిని మదిని తొలుస్తుంది. కళాశాల యాజమాన్యం, పోలీసులు పొంతనలేని సమాధానాలు, పేరెంట్స్ ఆవేదనతో చేసే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.

బర్త్ డే రోజే

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంటకు చెందిన ఎనగంటి అభిలాష్ మార్చి 1న బర్త్ డే సందర్భంగా కళాశాల మిత్రులతో కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కళాశాలకు తిరిగి వచ్చిన అభిలాష్(Abhilash Case) పని ఉందని మిత్రులకు చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. హాస్టల్ వార్డెన్ తోపాటు తోటి మిత్రులు పేరెంట్స్ కు సమాచారం అందించారు. తండ్రి ఎనగంటి శ్రీనివాస్ మార్చి 3న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్ఎండీ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అభిలాష్ ఆచూకీ మాత్రం లభించలేదు. చివరకు మార్చి 27న అలుగునూర్ కు చెందిన ఓ అమ్మాయి చనిపోతానని డయల్ 100 కు ఫోన్ చేయగా... ఫోన్ చేసిన లొకేషన్ ఆధారంగా తిమ్మాపూర్ సమీపంలోని బావుల్లో పోలీసులు గాలిస్తుండగా ఎంజేపీ పాఠశాల సమీపంలోని వ్యవసాయబావిలో అభిలాష్ తలలేని మృతదేహం లభించింది. అభిలాష్ ఇన్ స్టాగ్రామ్ పరిశీలించగా ప్రేమ విఫలమై, ఇక ఉండి లాభం లేదన్నట్టుగా పోస్టులు పెట్టాడని దీనిని ఆధారంగా చేసుకుని అతడు లవ్ లో ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నట్లు సీఐ స్వామి తెలిపారు. అయితే అభిలాష్ మృతిపై తండ్రి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేస్తూ... ఫిర్యాదు చేయడం, తల లేకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరింది.

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో విచారణ వేగవంతం

విద్యార్థి హాస్టల్(Hostel) నుంచి బయటకు వెళ్లి అదృశ్యమై 27 రోజుల తర్వాత తలలేని మొండేం లభించగా కళాశాల యాజమాన్యం పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో విచారణ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు.‌ అభిలాష్ మంథని నియోజకవర్గానికి చెందినవాడు కావడంతో సమగ్ర విచారణ జరిపి తల ఏమైందో తేల్చి వాస్తవాలు బయటపెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అభిలాష్ తలకోసం బావిలో నీళ్లన్ని ఖాళీ చేయించి వెతకగా ఏప్రిల్ 2న పుర్రె లభించింది.

తల మొండెం ఎలా వేరైంది

ఆత్మహత్య అయితే తల మొండెం ఎలా వేరైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యే అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంత కసిగా తల నరికి చంపేంత తప్పు ఏం చేశాడని ప్రతి ఒక్కరి మదిని తొలుస్తున్న ప్రశ్న. ఆత్మహత్య అయి ఉంటుందని ముందుగా చెప్పిన పోలీసులు మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) జోక్యంతో మాట మార్చి దొరికిన పుర్రె, మొండెంకు చెందిన శాంపిల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ వచ్చాక హత్యా? ఆత్మహత్యా? అనేది తేలుతుందని స్పష్టం చేశారు.

ప్రేమ వ్యవహారమే అభిలాష్ ప్రాణం తీసిందా?

కళాశాలకు చెందిన ఓ అమ్మాయి విషయంలోనే అభిలాష్ ప్రాణం పోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తుండగా అభిలాష్ బర్త్ డే రోజున సెలెబ్రేషన్(Birthday Celebrations) చేసుకున్నారు. అమ్మాయి అభిలాష్ కు చనువుగా ఉండడంతో గిట్టని మిత్రుడు పథకం ప్రకారం బయటకు తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. సెన్సిటివ్ అమ్మాయి ఎవరు పిలిచినా బయటకురాని పరిస్థితిలో అభిలాష్(Abhilash) పిలువగానే బయటకు వచ్చి కేక్ వినిపించడంతో కడుపుమండిన మరో అబ్బాయి అభిలాష్ తో మాట్లాడి బయటకు తీసుకెళ్లి మద్యం తాగించి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల విద్యార్థులు సైతం ఈ విషయంపై చర్చించడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. అందుకు సంబంధించిన పలువురు విద్యార్థుల ఫోన్ ట్రాక్ రికార్డ్(Phone Track Record) సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

కేసు తప్పుదారి పట్టించే కుట్ర జరిగిందా?

తిమ్మిని బమ్మిని చేసే కళాశాల యాజమాన్యం అభిలాష్(Abhilash Case)విషయంలో కేసును తప్పుదారి పట్టించే కుట్రపన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి మత్తులో అభిలాష్ ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థులతో చెప్పించడం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులను మచ్చిక చేసుకుని గంజాయి మత్తులో అభిలాష్ అదృశ్యమై ఆత్మహత్య చేసుకున్నాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేసినట్లు అభిలాష్ పేరెంట్స్ తోపాటు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కళాశాల యాజమాన్యంతోపాటు తోటి విద్యార్థులను ఇంటరాగేషన్ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ముందుగా కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నించగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) జోక్యంతో సీపీ అభిషేక్ మోహంతి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అభిలాష్ అదృశ్యం.. అనుమానాస్పద మృతిని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.

HT CORRESPONDENT K.V.REDDY KARIMNAGAR

తదుపరి వ్యాసం