Karimnagar Crime : కరీంనగర్ జిల్లాలో విషాదం, 11 నెలల బిడ్డకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య-karimnagar crime in telugu mother commits suicide after killed infant family disputes reason ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Crime : కరీంనగర్ జిల్లాలో విషాదం, 11 నెలల బిడ్డకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Karimnagar Crime : కరీంనగర్ జిల్లాలో విషాదం, 11 నెలల బిడ్డకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

Karimnagar Crime : కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ 11 నెలల చిన్నారికి విషమిచ్చి చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది. కళ్ల ముందే కూతురు, మనవడు చనిపోవడంతో తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.

కరీంనగర్ జిల్లాలో విషాదం

Karimnagar Crime : కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. నగర సమీపంలోని బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని విజయనగర్ కాలనీకి చెందిన శ్రీజ దారుణానికి ఒడిగట్టింది. కడుపున పుట్టిన 11 నెలల పసి బాలుడు శ్రీహాన్ష్ ను చంపి తాను విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. తల్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడం చూసి మనస్థాపంతో శ్రీజ తల్లి గాదె జయప్రద విష గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ లోని అపోలో రీచ్ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. శ్రీజ భర్త నరేష్ ది వరంగల్(Warangal) కాగా.. ఆయన హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్(Software Engineer) గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాలతో నాలుగు రోజుల క్రితమే శ్రీజ పుట్టింటికి వచ్చిందని స్థానికులు తెలిపారు. శ్రీజ బాబుకు విషగుళికలు ఇచ్చి బాబు మృతి చెందాక ఆమె ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు.

తల్లిదండ్రులు టీచర్స్..భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి

కరీంనగర్ (Karimnagar)సమీపంలోని విజయనగర్ కాలనికి చెందిన గాదె జయప్రద వెంకటేశ్వరచారి దంపతులిద్దరూ టీచర్స్. కూతురు శ్రీజను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి వరంగల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నరేష్ కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఇటు తల్లిదండ్రులు, అటు భర్త ఉద్యోగులే కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది శ్రీజ. బాబు పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad)లో ఉద్యోగం చేస్తున్న భర్త నరేష్ శ్రీజ మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయని స్థానికులు తెలిపారు. క్షణికావేశంతో శ్రీజ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. భర్తపై కోపంతో బాబుకు విషమిచ్చి తాను విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కూతురు, మనవడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో శ్రీజ తల్లి తీవ్ర మనస్థాపానికి గురై విషం మింగి ప్రాణాపాయ స్థితికి చేరింది. వెంటనే స్థానికులు జయప్రదను అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తండ్రి ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు

కొడుకును చంపి తాను ఆత్మహత్య(Suicide) చేసుకున్న శ్రీజ తండ్రి వెంకటేశ్వరచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త నరేష్ వేధింపులతోనే శ్రీజ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ రూరల్ పీఎస్ పోలీసులు భర్త నరేష్ పై నమోదు చేశారు. ప్రస్తుతం భర్త నరేష్ పరారీలో ఉండడంతో అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. కొడుక్కి విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

HT Correspondent K.V.Reddy Karimnagar