USA Women's Cricket Team: అమెరికా వుమెన్స్ నేషనల్ టీమ్‌లో 15 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి
USA Cricket Team: హైదరాబాద్ మూలాలు ఉన్న ఓ 15 ఏళ్ల అమ్మాయి అమెరికా వుమెన్స్ నేషనల్ టీమ్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడిప్పుడు క్రికెట్ కు క్రేజ్ పెరుగుతున్న యూఎస్ఏలో మన భారతీయులు హవా కొనసాగిస్తున్నారు.
USA Cricket Team: కేవలం 15 ఏళ్ల వయసులోనే అమెరికా వుమెన్స్ నేషనల్ టీమ్ లో చోటు దక్కించుకుంది ఓ తెలుగు అమ్మాయి. ఆమె పేరు ఇమ్మడి సాన్వి. ఇఫ్పుడామె యూఏఈలో జరగబోయే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో అమెరికా టీమ్ తరఫున ఆడనుంది. సాన్వి ఓ ఆల్ రౌండర్ కావడం విశేషం. అయితే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాలుగేళ్లలోనే ఆమె జాతీయ జట్టుకు ఆడబోతోంది.
సాన్వీ క్రికెట్ జర్నీ
ఇమ్మడి సాన్వీ మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులు సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలోనే ఉండేవారు. అయితే 1997లో అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడి కాలిఫోర్నియా రాష్ట్రంలో సాన్వీ ఫ్యామిలీ సెటిలైంది. ఆమె తండ్రి రమేష్ ప్రస్తుతం సిస్కో సిస్టమ్స్ లో కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు. సాన్వీ కూడా హైదరాబాద్ కే చెందిన ఐసీసీ లెవల్ 3 కోచ్ జగదీశ్ రెడ్డి కోచింగ్ లో రాటుదేలింది.
2020లో సాన్వీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. కాలిఫోర్నియాలోని సాన్ రామన్ యూత్ క్రికెట్ అసోసియేషన్ టీమ్ తరఫున ఆమె ఆడింది. అండర్ 13 స్టేజ్ లో తొలి మ్యాచ్ లోనే 9 వికెట్లతో రాణించింది. ఆ తర్వాత ఎంఎల్‌సీ జూనియల్ లీగ్ లో కాలిఫోర్నియా అండర్ 15 జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించింది.
సాన్వీ ఓ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్. ఈ మధ్యే జరిగిన సాన్ డీగో టీ20 టోర్నీలో 10 వికెట్లు తీసుకుంది. ఆ తర్వాత యూఎస్ నేషనల్ సెలక్షన్స్ టోర్నీలో 9 వికెట్లు తీసుకొని నేషనల్ టీమ్ కు ఎంపికైంది. ఇమ్మడి సాన్వీ ప్రొఫైల్ న్యూయార్క్ క్రికెట్ లీగ్ వెబ్ సైట్లో ఉంది. ఆ సైట్ ప్రకారం.. సాన్వీ ఇప్పటి వరకూ మొత్తంగా 145 మ్యాచ్ లు ఆడి 819 పరుగులు చేయడంతోపాటు 77 వికెట్లు తీసుకుంది.
అమెరికాలో టీ20 వరల్డ్ కప్ 2024
ఈ ఏడాది జరగబోయే మెన్స్ టీ20 వరల్డ్ కప్ కు అమెరికా కూడా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. కరీబియన్ దీవులతోపాటు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా నగరాల్లోనూ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. అగ్రరాజ్యంలోనూ క్రికెట్ కు ఆదరణ పెంచడానికి ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైఓల్టేజ్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా న్యూయార్క్ లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసమే ప్రత్యేకంగా ఓ తాత్కాలిక స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యాచ్ జూన్ 11న జరగనుంది.
ఈ మెగా టోర్నీ ద్వారా అమెరికాలోనూ క్రికెట్ క్రేజ్ పెరగనుంది. బాస్కెట్ బాల్, అమెరికన్ ఫుట్‌బాల్, బేస్ బాల్, ఐస్ హాకీలాంటి గేమ్స్ అమెరికాలో ఎక్కువగా ఆడతారు. అలాంటి దేశంలో క్రికెట్ కు క్రేజ్ పెంచాలని ఐసీసీ చూస్తోంది. రాబోయే టీ20 వరల్డ్ కప్ లో ఆ దేశ జట్టు కూడా ఆడుతోంది. అందులోనూ భారత సంతతికి చెందిన ప్లేయర్సే ఎక్కువగా ఉండటం విశేషం.