Karimnagar MP Ticket : తెరపైకి కొత్త పేర్లు....! కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు...?-who will get karimnagar congress mp ticket in loksabha polls 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar Mp Ticket : తెరపైకి కొత్త పేర్లు....! కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు...?

Karimnagar MP Ticket : తెరపైకి కొత్త పేర్లు....! కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు...?

HT Telugu Desk HT Telugu
Mar 28, 2024 04:51 PM IST

Loksabha Elections in Telangana 2024: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది. స్థానిక నేతలు టికెట్లు ఆశిస్తుండగా…. మరోవైపు తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపైకి వస్తోంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో భాగంగా… ఈ సీటును తమకు ఇవ్వాలని సీపీఐ కోరుతోంది.

*కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
*కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

Karimnagar Lok Sabha constituency: కరీంనగర్ లో కాంగ్రెస్(Karimnagar Congress) రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ రేపుతోంది. బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు సరికొత్త సమీకరణలు సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త పేర్లను తెరపైకి తెస్తుంది. బిజేపి నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బిఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తుండడంతో ఆ రెండు పార్టీల అభ్యర్థులను ఢీ కొట్టే ప్రజాబలం గల నాయకుడిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే కరీంనగర్ అభ్యర్థి ఎంపిక జాప్యం అవుతుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఈనెల 30న జరిగే సిఈసి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నిజామాబాద్ కు జీవన్ రెడ్డి…

ఎట్టకేలకు జగిత్యాల కు చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి నిజామాబాద్ ఎంపీ టికెట్ లభించింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, కరీంనగర్ కు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనప్పటికి అధికారికంగా ప్రకటించలేదు. అనేక సంప్రదింపుల తర్వాత చివరకు జీవన్ రెడ్డి కి నిజామాబాద్ టికెట్ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జీవన్ రెడ్డి కి నిజామాబాద్ ఎంపీ టికెట్ లభించడంతో ఇక కరీంనగర్ పై కాస్త క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉండగా ఉమ్మడి జిల్లానుంచి ఒక్క రెడ్డి కే టికిట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే ఇక ప్రవీణ్ రెడ్డి కి టికెట్ లభించే అవకాశాలు లేవనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బిసి లేదా వెల్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వెలిచాల రాజేందర్ రావు, చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మల్లన్న(Teenmar Mallanna) పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మృత్యుంజయంకు టికెట్ కోసం డిమాండ్….

కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పై ఆచితూచి అడుగులు వేస్తుండడంతో కరీంనగర్ టికెట్(Karimnagar Congress MP ticket) బ్రాహ్మణులకు కేటాయించాలని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కోరుతుంది. ఉమ్మడి జిల్లా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అత్యవసర సమావేశమై ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా శ్రేయస్సును కోరుకునే మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయంకు టికెట్ కేటాయించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షునిగా, కరీంనగర్ శాసనసభ్యునిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మృత్యుంజయంకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయనను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కస్బా భూమేశ్వరరావు, పురం ప్రేమ్ చందర్ రావు తెలిపారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మృత్యుంజయం ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ఎదుగుదలకు ఎంతో దోహదం చేశారన్నారు. ఇలాంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ ఇవ్వడం వల్ల బ్రాహ్మణ కులానికే కాకుండా, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే వ్యక్తిని ఎంపిక చేసిన వారు అవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులను విశ్వసించి, బ్రాహ్మణ జాతిని గౌరవించే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

టికెట్ పై సిపిఐ ఆశలు

ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ తెలంగాణ ఒక ఎంపీ స్థానాన్ని అడుగుతుంది. వరంగల్ పై సిపిఐ ఫోకస్ పెట్టినా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వరంగల్ కాదనుకుంటే కరీంనగర్(Karimnagar MP ticket) సిపిఐకి కెటాయించాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటివరకు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 13 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించి కరీంనగర్, వరంగల్, ఖమ్మం పెండింగ్ లో పెట్టడంతో సిపిఐ టికెట్ పై ఆశలు పెట్టుకుంది. వారి ఆశలు ఏ మేరకు కాంగ్రెస్ నెరవేరుస్తుందో తెలియదు కానీ, కమ్యునిస్టులు మాత్రం గంపెడు ఆశలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు.

రిపోర్టింగ్ - కరీంనగర్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.