Karimnagar loksabha: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నేతలు..
Karimnagar loksabha: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. నేతలంతా అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.
Karimnagar loksabha: కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ఎంపిక ఆలస్యంతో సరికొత్త సమీకరణాలు, కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తు 14 మంది దరఖాస్తు చేసుకోగా హుస్నాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి Praveen Reddy పేరు ముందు వరుసలో ఉంది. సామాజిక సమీకరణలు, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బిఆర్ఎస్ BRS బిజేపి BJP కి దీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ Congress.
అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ కొనసాగిస్తుంది. ఈనెల27న డిల్లీలో జరిగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో కరీంనగర్ అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చివరి ప్రయత్నంగా ఆశావాహులు అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
తెరపైకి కొత్త ముఖాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ TS Congress అధికారంలో ఉండడంతో కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. టికెట్ కోసం కాంగ్రెస్ కు చెందిన 14 మంది దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఫిల్టర్ చేసి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు, ప్రత్యామ్నాయంగా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెలిచాల జగపతి రావు కుమారుడు రాజేందర్ రావు పేరును డిల్లీకి పంపించారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఇద్దరు కాకుండా చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మల్లన్న పేరును సైతం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కరీంనగర్ టికెట్ నిజామాబాద్ తో ముడిపడి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై ఆధారపడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నిజామాబాద్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి టికెట్ ఇస్తే కరీంనగర్ లో రెడ్డికి కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన కాంగ్రెస్ పెద్దల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కరీంనగర్ నిజామాబాద్ లో ఒక్క రెడ్డికి మాత్రమే టికెట్ లభించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో ఆశావాహులు టికెట్ కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కరీంనగర్ పై సిపిఐ కన్ను…
ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ తెలంగాణ ఒక ఎంపీ స్థానాన్ని అడుగుతుంది. వరంగల్ పై సిపిఐ ఫోకస్ పెట్టినా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వరంగల్ కాదనుకుంటే కరీంనగర్ సిపిఐకి కెటాయించాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతంలో సిపిఐ హుస్నాబాద్, సిరిసిల్ల సెగ్మెంట్లలో ఎమ్మెల్యే లను గెలుచుకున్న చరిత్ర ఉంది.
ఇతర నియోజకవర్గాల్లో సైతం తమకు పట్టుందని.. సిపిఐకి కరీంనగర్ కెటాయిస్తే మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ని బరిలోకి దింపాలని కమ్యూనిస్టులు బావిస్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ సస్పెన్స్... బిజేపి, బిఆర్ఎస్ ప్రచారం ముమ్మరం
కరీంనగర్ పై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేశాయి. బిజేపి నుంచి సిట్టింగ్ ఎంపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ కుమార్ పోటీ చేస్తుండగా, బిఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ బరిలో నిలిచారు.
కరీంనగర్ కదన భేరితో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఈనెల 12న సమరశంఖం పూరించడంతో అభ్యర్థి వినోద్ కుమార్ తోపాటు గులాబీ సైన్యం క్షేత్రస్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు. అటు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర తో పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరిగొచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జగిత్యాలలో విజయసంకల్ప సభతో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఇక కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపిక పైనే మల్లగుల్లాలు పడుతుంది. అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతుండడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురి అవుతున్నారు. కనీసం ఈ వారంలోనైనా అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.
కరీంనగర్ లో విచిత్ర పరిస్థితి
రాజకీయంగా కరీంనగర్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బిజేపి కి చెందిన బండి సంజయ్ ఉండగా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు, మూడు బిఆర్ఎస్ గెలుచుకున్నాయి.
మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రం కాంగ్రెస్ కంటే బిఆర్ఎస్ 5249 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.
బిఆర్ఎస్ కు 5 లక్షల 17 వేల 601 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 5 లక్షల 12 వేల 352 ఓట్లు, బిజేపి కి 2 లక్షల 50 వేల 400 ఓట్లు లభించాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బిజెపి నేత బండి సంజయ్ కి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 లక్షల 98 వేల 276 ఓట్లు లభించగా నాలుగున్నర ఏళ్ళ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపికి రెండు లక్షల 50 వేల ఓట్లే దక్కాయి.
అయితే అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో ఉండదని మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆచితూచి తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం