Greater HYD Politics: గ్రేటర్‌లో వలస నేతలకు కాంగ్రెస్ పెద్దపీట, క్యాడర్ సహకారంపై సందేహాలు
Greater HYD Politics: గ్రేటర్ హైదరాబాద్‌లో వలస నేతలకు కాంగ్రెస్ గాలం వేసినా, క్యాడర్ ఏ మేరకు సహకరిస్తుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Greater HYD Politics: గ్రేటర్ హైదరాబాద్‌లో వలస నేతలకే కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేసింది.ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న సీనియర్లను కాదని ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలకు ఆ పార్టీ జై కొట్టింది.గురువారం 57 మందితో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల Congress Candidates జాబితా విడుదల చేసింది.
సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ Danam Nagender, మల్కాజ్ గిరి నుంచి జడ్పీ ఛైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి Sunitha Mahender Reddy, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి Ranjith Reddy పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.
ఈ ముగ్గురు ఇటీవలే కారు దిగి హస్తం గూటికి చేరిన వారే కావడం గమనార్హం.ఇతర పార్టీల నుంచి కొత్తగా కాంగ్రెస్ లో చేరిన వారికి టిక్కెట్లు కేటాయించడంతో మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి ఆశాభంగం తప్పడం లేదు.
పార్టీ అధిష్టానం తీరుతో అక్కడక్కడ పార్టీ శ్రేణులు నుంచి అసంతృప్తి జ్వాలలు మొదలు అయ్యాయి. అయితే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘోర ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్.....గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది.
గ్రేటర్ పరిధిలో ముగ్గురు వలస నేతలకు టిక్కెట్లు...
హైదరబాద్ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కనీస ప్రాతినిద్యం లేక పోవడంతో అధికార కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి హైదరాబాద్ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పై దృష్టి సారించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు స్థానాలలో కనీసం మూడు స్థానాలను కైవసం చేసుకునేలా సీఎం వ్యూహాలు రచిస్తున్నారు.
అందులో భాగంగా ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.దీంతో చేవెళ్ల టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, అయన సతీమణి వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ సునీత రెడ్డి లు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆమెకు మల్కాజిగిరి స్థానాన్ని కేటాయించారు.
ఆ తరువాత సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కూడా చేవెళ్ల స్థానాన్ని ఆశిస్తూ....కారు దిగి కాంగ్రెస్ లో చేరి చేవెళ్ల టికెట్ మరోసారి దక్కించుకున్నారు.మరోవైపు సికింద్రబాద్ టికెట్ ఆశించిన హైదరాబాద్ నగర మాజీ మేయర్ రామ్మోహన్ అయన సతీమణి శ్రీదేవి ఇటీవలే బిఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ లో చేరినా ఆయనకు మాత్రం కాంగ్రెస్ లోనూ సికింద్రాబాద్ టికెట్ రాలేదు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ టికెట్ కైవసం చేసుకున్నారు. ఈయనతో పాటు ప్రస్తుత హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా కారు పార్టీలో సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి సీటు ఆశించి దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరినప్పటికి ఇక్కడా వారికి భంగపాటు తప్పలేదు.
కేడర్ సహకరిస్తుందా…?
మాజీ ఎమ్మెల్యే హన్మంతు రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందే బి అర్ ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మళ్ళీ లోక్ సభ బరిలో నిలిచిన తన అదృష్టాన్ని పరీక్షించుకావాలని భావించారు.మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు టికెట్ ఆశించారు.
ఈయనతో పాటు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం కారు పార్టీ సీనియర్ లీడర్ సినీ నటుడు అల్లు అర్జున్ మేన మామ కంచర్ల చంద్రశేఖర్ కూడా ఇదే మల్కాజిగిరి సీటు ఆశించినా టికెట్ మాత్రం వీరికి దక్కలేదు.
అనూహ్య పరిణామాల మధ్య వికారాబాద్ జెడ్పీ ఛైర్‌పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్ కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్న పార్టీలో చేరినా నేతలకు పార్టీ టికెట్ కేటాయించడంతో వీరి గెలుపుకు గ్రౌండ్ లెవల్ కేడర్ సహకరిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)
సంబంధిత కథనం