Nizamabad Kala Bharati : నిజామాబాద్‌లో 'కళాభారతి' అటకెక్కినట్టేనా….?
Kala Bharati Auditorium in Nizamabad: నిజామాబాద్‌లో కళాభారతి అటకెక్కినట్టేనా..? అన్న చర్చ జరుగుతోంది. సంబంధిత స్థలాన్ని ధర్నాచౌక్‌కు కేటాయించటంతో ఈ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Kala Bharati Auditorium in Nizamabad: నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న పాత కలెక్టరేట్ ప్రభుత్వ స్థలం పడావుగా పడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థలంలో కళాభారతి నిర్మిస్తామని చెప్పి.. ఏకంగా కలెక్టరేట్ కార్యాలయాన్ని నేలమట్టం చేసింది. కలెక్టరేట్ కార్యాలయంతో పాటు క్యాంపు కార్యాలయాన్ని కూడా కూల్చింది. జిల్లాలోని ప్రజాసంఘాలు, రాజకీయ నాయకుల అభ్యంతరాలను పట్టించుకోకుండా కూల్చివేసింది. దీంతో పాటు కలెక్టరేట్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఇరిగేషన్ కార్యాలయాలను, ఎమ్మార్వో కార్యాలయాన్ని కూడా కూల్చింది. ఈ స్థలంలో ఉన్న ప్రెస్‌క్లబ్ భవంతిని కూడా కూల్చేందుకు సిద్ధమైనా జర్నలిస్టులను నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కి తగ్గింది. ప్రెస్‌క్లబ్‌కు స్థలం చూపి, భవంతి నిర్మించే వరకు ప్రస్తుతం ఉన్న భవంతిని కూల్చొద్దని స్పష్టం చేయడంతో కొంత వెనక్కి తగ్గింది. కానీ విచిత్రం ఏమిటంటే నాడు కళాభారతితో పాటు ఇతర నిర్మాణాల కోసం సేకరించిన విలువైన భూమి నేడు పడావుగా పడి ఉంది. చివరకు ఆ స్థలాన్ని ధర్నచౌక్‌కు కేటాయిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గతంలో పాత కలెక్టరేట్‌ను ఆనుకుని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల కోసం ధర్నా చేసేవారు. అయితే ఈ స్థలంలో ధర్నా చేయడం వలన ప్రధాన రహదారి ద్వారా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, జిల్లా కోర్టు కాంప్లెక్స్, జనరల్ హాస్పటల్ లకు వేళ్లే వారికి అడ్డంకులు, ఇబ్బందులు కలుగుతున్నాయని సీపీ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ రెవెన్యూ డివిజినల్ అధికారి 1000 చదరపు అడుగుల స్థలం గల ప్రదేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ లోని ఆబాదీ ప్రాంతంలోని పాత మున్సిపల్ కార్యాలయం ప్రక్కన ఉన్న 1000 చదరపు గజాల స్థలాన్ని నిజామాబాద్ దక్షిణ మండల సర్వేయర్ ద్వారా హద్దులు నిర్ణయించారు. ఇకపై ఈ స్థలంలో ధర్నాలు చేసుకోవాలని ప్రకటించారు.
కళాభారతి నిర్మణం హుళక్కేనా?
పాత కలెక్టరేట్ కూల్చిన ప్రదేశంలో కళాభారతి నిర్మిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ స్థలంపై అప్పటి ప్రభుత్వ పెద్దలు కన్నేశారని, షాపింగ్ మాల్ పేరిట ఈ స్థలాన్ని కబ్జా చేయాలనే ప్రణాళిక రూపొందించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ స్థలంలో కళాభారతి నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మొత్తం రూ.50 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సకలహంగులతో నిర్మిస్తామని ప్రకటించారు. అయితే పాత కలెక్టరేట్ కార్యాలయం స్థలంలో కళాభారతి నిర్మిస్తే.. దాని ఎదురుగా ఉన్న స్థలంలోని ఇరిగేషన్, డ్వాక్రా సముదాయల భవంతిని ఎందుకు కూల్చారనే ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ఈ స్థలంలో ఇతర భవంతులు నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ.. అదేదీ జరగలేదు. పైగా కళాభారతి భవంతిని 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పనప్పటికీ.. ఆదీ జరగలేదు. చివరకు నాడు అభివృద్ధి కోసం సేకరించిన స్థలంలో నేడు ధర్నాచౌక్‌ను అనుమతించడం గమనార్హం.
రిపోర్టింగ్ - నిజామాబాద్ జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం