TS Communist Parties Alliance : క్రాస్ రోడ్డులో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వైపు చూపులు!
TS Communist Parties Alliance : సీఎం కేసీఆర్ హ్యాండివ్వడంతో కమ్యూనిస్టు పార్టీలో క్రాస్ రోడ్డులో నిలబడ్డాయి. కొత్త పొత్తుల కోసం చూస్తున్న కామ్రేడ్లు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని సమాచారం.
TS Communist Parties Alliance : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారని భావించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు క్రాస్ రోడ్స్‌లో నిలబడ్డాయి. మునుగోడు ఉపఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కునే వ్యూహంతో చేతులు కలిపిన బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల స్నేహం మూణ్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తమ గెలుపు గుర్రాలను ప్రకటించడం కమ్యూనిస్టులకు మింగుడుపడడం లేదు. ఇప్పటికిప్పుడు ఆ పార్టీలు కొత్త స్నేహితులను వెదుక్కోవాల్సిన అనివార్య పరిస్థితులలో కూరుకుపోయాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఇరుపార్టీలు కలిసి ఒంటరిగా బరిలోకి దిగాలా? లేదా ఏదైనా పార్టీతో జత కట్టాలా అన్న మీమాంసలో ఉన్నాయి.
కాంగ్రెస్‌కు దగ్గరగా సీపీఐ
సీపీఐ, సీపీఎం కలిసే ఎన్నికలకు వెళతామని ప్రకటించిన మరునాడే సీపీఐ కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సీపీఐకి కాంగ్రెస్‌తో సూత్రపాయమైన పొత్తు కుదిరిందని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకొని పోటీచేశాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ నల్లగొండ జిల్లాలో దేవరకొండ స్థానాన్ని గెలుచుకోగలిగింది. నిజంగానే కాంగ్రెస్ తో పొత్తు ఖరారయ్యే పక్షంలో సీపీఐకి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానాన్ని కేటాయిస్తారని సమాచారం. ఇక్కడి నుంచి ఆ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసే అవకాశం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఆయనకు బీఆర్ఎస్ టికెట్ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని భావించినా.. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా సీపీఐ ఇంకా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు స్థానాలను కూడా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో పై నియోజకవర్గాలలో సీపీఐ ప్రాతినిధ్యం వహించింది.
స్పష్టత లేని సీపీఎం
మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఎం, కాంగ్రెస్ తో జత కలుస్తుందా? ఒంటరి పోరాటం చేస్తుందా? అన్న అంశంలో ఇంకా స్పష్టత రాలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 2018 ఎన్నికల్లో బీఎల్ఎఫ్ ప్రయోగంతో సీపీఎం చేతులు కాల్చుకుంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత సీపీఐ కాంగ్రెస్ తో పొత్తుకు వెళుతోందన్న వార్తలపై సీపీఎం నేతలు వ్యాఖ్యానించడానికి సుముఖంగా లేరు. ఒక వేళ అనివార్య పరిస్థితుల్లో సీపీఎం కూడా కాంగ్రెస్ తో జతకూడే పక్షంలో నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడెం, ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానాలను కోరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మిర్యాలగూడెం నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పాలేరు నుంచి సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. కానీ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలకే సరిపడా జనరల్ స్థానాలు లేని కారణంగా ఇది సాధ్యపడుతుందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి రాకుంటే కమ్యూనిస్టులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.