తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Smita Sabharwal On Konda Surekha : కొండా సురేఖ మాటలు విని షాక్ అయ్యా.. మంత్రి వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారి విచారం

Smita Sabharwal on Konda surekha : కొండా సురేఖ మాటలు విని షాక్ అయ్యా.. మంత్రి వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారి విచారం

03 October 2024, 11:39 IST

google News
    • Smita Sabharwal on Konda surekha : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై రాజకీయ, సినీ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ విచారం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో హుందాతనం ఉండాలన్నారు.
స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్ (@SmitaSabharwal)

స్మితా సబర్వాల్

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు సురేఖ కామెంట్స్‌ను ఖండించగా.. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ విచారం వ్యక్తం చేశారు.

'స్త్రీలను క్లిక్ బైట్‌లుగా, సంచలనాలకు థంబ్‌నెయిల్‌లుగా చూస్తున్నారు. అధికారులను కూడా వదిలిపెట్టడం లేదు. నేను వ్యక్తిగత అనుభవం నుండి మాట్లాడుతున్నాను. కష్టపడి పైకి ఎదగడం తప్పు కాదు కదా. మహిళలను, కుటుంబాలను, సామాజిక నిబంధనలను గౌరవిద్దాం. సిట్టింగ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ మాటలు విని షాక్ అయ్యాను. అన్ని విషయాలను రాజకీయాల కోసం వాడుకోవద్దు. ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించాలి' అని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.

మంత్రి కొండా సురేఖకు పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఫోన్ చేశారు. సమంత, నాగచైతన్య వివాదంపై మాట్లాడిన మహేష్‌గౌడ్.. వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు సూచించారు. దీంతో కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. 'సమంతపై వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవి. సమంత ట్వీట్‌ చూసి నేను చాలా బాధపడ్డాను. నాకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదనే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా కేటీఆర్‌ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు. కేటీఆర్ నాకు క్షమాపణ చెప్పాలి. కేటీఆర్‌ వేసే పరువు నష్టం దావాను లీగల్‌గానే ఎదుర్కొంటా' అని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై రాంగోపాల్‌వర్మ స్పందించారు. 'కన్నులతో చూసి, చెవులతో విన్నట్టు చెప్పడం దారుణం. సమంత, నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను..తీవ్రంగా ఖండించాలి. కేటీఆర్‌ను దూషించే క్రమంలో.. సమంత, నాగార్జున ఫ్యామిలీని అవమానించడంలో అర్థమేంటో.. ఆమెకైనా అర్థమైందో లేదో నాకు అర్థమడంలేదు' అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఇష్యూపై స్పందించారు. 'కొండా సురేఖ వ్యాఖ్యలకు చాలా బాధపడ్డా. మా సభ్యులపై దుర్మార్గపు మాటల దాడిని వ్యతిరేకిస్తాం. సంబంధంలేని వ్యక్తులను, మహిళలను..తమ రాజకీయాల్లోకి లాగడం దారుణం' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

'కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టారు. నాగచైతన్య - సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లడానికి కూడా కారణం కేటీఆర్. ఈ విషయం అందరికి తెలుసు' అని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.

తదుపరి వ్యాసం