SRH Vs MI IPL Match : ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కు వెళ్తున్నారా? వీటిని తీసుకెళ్లొద్దు!
26 March 2024, 21:37 IST
- SRH Vs MI IPL Match : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపటి సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 2500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేడియానికి టీఎస్ఆర్టీసీ 60 స్పెషల్ బస్సులు నడుపుతోంది.
ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కు వెళ్తున్నారా?
SRH Vs MI IPL Match : హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రేపు(మార్చి 27) సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్(SRH Vs MI Match) జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఐపీఎల్(IPL 2024) మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లను రాచకొండ సీపీ తరుణ్ జోషి పర్యవేక్షించారు. మొత్తం 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో 39 వేల సీటింగ్ కెపాసిటీ ఉందని సీపీ తరుణ్ జోషి తెలిపారు. బుధవారం రాత్రి జరిగే ఈ మ్యాచ్ కోసం స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు.
స్టేడియంలోకి వీటిని తీసుకురావొద్దు
ఐపీఎల్ మ్యాచ్(Uppal IPL Match) వీక్షించేందుకు వచ్చే ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్, ల్యాప్ ట్యాప్, బ్యానర్స్, లైటర్స్, బైనాక్యులర్స్, సిగరెట్లు తీసుకురావొద్దని సీపీ తరుణ్ జోషి తెలిపారు. స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు అనుమతించమని స్పష్టం చేశారు. కేవలం బ్లూటూత్స్ మాత్రమే అనుమతిస్తామన్నారు. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ (She Teams)మఫ్టీలో ఉంటాయని, ఆకతాయిల పనిపెట్టేందుకు సిద్ధంగా ఉంటారని సీపీ తరుణ్ జోషి(CP Tarun Joshi) తెలిపారు. ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తులో ఉన్నాయని స్పష్టం చేశారు. బుధవారం 3 గంటల ముందు నుంచి మాత్రమే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు. స్టేడియం వద్ద అంబులెన్స్‌లు, మెడికల్ బృందాలు, ఫైర్ ఇంజిన్లను రెడీ ఉంచుతామన్నారు. టికెట్లు ఉన్న వారి వాహనాలకు స్టేడియం వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు. అయితే బ్లాక్ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. ఉప్పల్ స్టేడియం లోపల ఫుడ్ వెండర్స్ ఆహార పదార్థాలను ఎక్కువ ధరకు అమ్మకూడదని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు(Uppal Traffic Diversions) ఉంటాయని సీపీ చెప్పారు. భారీ వాహనాలకు అనుమతిలేదన్నారు. మొత్తం 4 వేల కార్లు, 6 వేల ద్విచక్క వాహనాల పార్కింగ్ కు ఏర్పాటు చేశామన్నారు.
ఉప్పల్ స్టేడియానికి 60 స్పెషల్ బస్సులు
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్(SRH Vs MI) మధ్య ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ(TSRTC Special Buses) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడుపుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని ఐపీఎల్ మ్యాచ్ (IPL Match)ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.