TSRTC Employees DA : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, అన్నీ డీఏలు ఒకేసారి క్లియర్!
TSRTC Employees DA : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏడు డీఏలను ఒక్కసారిగా క్లియర్ చేసేందుకు సిద్ధమైంది. హెచ్ఆర్ఏ కోతను డీఏలతో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఉద్యోగులకు డీఏను 43.2 శాతంగా ఫిక్స్ చేసింది.
TSRTC Employees DA : టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల (TSRTC Employees) వేతన సవరణ లెక్కలుతేలాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరువు భత్యం (DA)ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇటీవల చేపట్టిన వేతన సవరణలో భాగంగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 82.6 శాతం డీఏ బకాయిలలో రాష్ట్ర ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది. ఇంకా మిగిలిన 51.5 శాతం డీఏ బకాయిని 43.2 శాతం వద్ద స్థిరీకరించింది. వేతన సవరణతో వచ్చే మూల వేతనంపై 43.2 శాతం డీఏను లెక్కించి జీతంతో చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
హెచ్ఆర్ఎస్ సవరణ లోటును డీఏలతో భర్తీ
అయితే ఇంటి అద్దె భత్యం (HRA) సవరణతో ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బంది పడ్డారు. హెచ్‌ఆర్‌ఏ భారీగా తగ్గిందని ఉద్యోగుల ఆందోళన చెందారు. హెచ్‌ఆర్‌ఏలో కోతతో జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం డీఏ బకాయిలు(TSRTC DAs Clear) చెల్లిస్తుండడతో కొంత మేర ఆ లోటు తగ్గుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం డీఏ 82.6 శాతం ఉంది. 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణను అమలు చేస్తుండడంతో అప్పటికి ఉన్న 31.1 శాతం డీఏ ఉద్యోగుల మూలవేతనంలో కలిసింది. అయితే ఇంకా 51.5 శాతం డీఏ బకాయి ఉంటుంది. దీనిని వేతన సవరణ పద్ధతి ప్రకారం సవరించి కొత్త డీఏను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ లెక్కల ప్రకారం ఉద్యోగులకు 43.2 శాతం డీఏ చెల్లించాలని తేల్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు విడతల డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు(TSRTC Employees) మాత్రం అన్ని డీఏలు ఒక్కసారిగా చెల్లించాలని నిర్ణయించారు.
అన్ని డీఏలు ఒకేసారి చెల్లింపు
ఈ ఏడాది జనవరికి సంబంధించిన 3.9 శాతం డీఏను తాజా వేతన సవరణలో చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆర్టీసీ ఉద్యోగులకు(TSRTC DA) ఏడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల ఒత్తిడి, సజ్జనార్(Sajjanar) కృష్టితో ప్రభుత్వం అన్ని డీఏలు ఒక్కసారిగా చెల్లించాలని నిర్ణయించింది. మొత్తం బకాయిలు క్లియర్ చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులకు తాజా డీఏ 43.2 శాతం వచ్చే జీతంతో అందనుంది.
21 శాతం ఫిట్మెంట్
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ (TSRTC PRC)ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్ తో ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పీఆర్సీపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఇటీవల ప్రకటన చేశారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలులోకి వస్తుందని తెలిపారు. దీంతో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల అదనపు భారం పడనుందన్నారు. పీఆర్సీ ప్రకటనతో 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ పీఆర్సీ ప్రకటనతో ప్రభుత్వ ఖజానాపై ఏటా 418.11 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.