తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Police : హైదరాబాద్‌లో రేపు ఉదయం వరకు నిమజ్జనం.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

Hyderabad Police : హైదరాబాద్‌లో రేపు ఉదయం వరకు నిమజ్జనం.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

17 September 2024, 17:18 IST

google News
    • Hyderabad Police : హైదరాబాద్ మహా నగరంలో గణపతి నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. రేపు ఉదయం వరకు నిమజ్జం పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్టు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
హుస్సేన్‌సాగర్ వద్ద సీఎం రేవంత్‌తో సీవీ ఆనంద్
హుస్సేన్‌సాగర్ వద్ద సీఎం రేవంత్‌తో సీవీ ఆనంద్ (@CVAnandIPS)

హుస్సేన్‌సాగర్ వద్ద సీఎం రేవంత్‌తో సీవీ ఆనంద్

బుధవారం ఉదయంలోగా హైదరాబాద్ నగరంలో నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని.. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వివరించారు. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూశామన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులతో మాట్లాడి.. త్వరగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

హైదరాబాద్ నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. షిఫ్ట్‌ల ప్రకారం డ్యూటీలు చేస్తున్నారని.. ఒక్కో షిఫ్ట్‌లో 25 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నట్టు వివరించారు. లక్ష విగ్రహాల్లో ఇంకా 20 వేల విగ్రహాలు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో రావాలని కోరారు. వీలైతే.. లైవ్‌ టెలికాస్ట్‌ చూడాలని కోరుతున్నట్టు సీపీ స్పష్టం చేశారు. దీనివల్ల ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని సీవీ ఆనంద్ వివరించారు.

మంగళవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తైంది. భక్తుల కోలాహలం మధ్య ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద బడా గణేషుడిని నిమజ్జనం చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభయాత్ర.. మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. మహా గణపతి శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్‌ గణపయ్య శోభయాత్ర మంగళవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. గణేషుడు టెలిఫోన్‌ భవన్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్‌ బండ్‌ చేరుకున్నాడు. అక్కడ వెల్డింగ్‌ పనులు పూర్తి చేసిన తర్వాత మహాగణపతికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద ఉన్న భారీ క్రేన్ వద్ద నిమజ్జనం చేశారు. గణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్‌ జనసంద్రంగా మారిపోయింది. గతపతి బప్పా మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మోతమోగుతున్నాయి.

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని చూసి ప్రజలు కేరింతలు కొట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం సెక్రటేరియట్‌కు వెళ్లారు. సెక్రటేరియెట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ స్వాగతం పలికారు. తెలుగుతల్లి ప్లైఓవర్ కింద నుంచి ఎన్టీఆర్ మార్గ్ లని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి... నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమజ్జన వేడుకలో సీఎం పాల్గొనడం ఇదే మొదటిసారి.

తదుపరి వ్యాసం