Kishan Reddy: పరేడ్‌ గ్రౌండ్స్‌లో శాశ్వతంగా హైదరాబాద్‌ ముక్తి దివాస్ నిర్వహిస్తామన్న కిషన్‌ రెడ్డి-kishan reddy said that hyderabad mukti diwas will be held permanently at the parade grounds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kishan Reddy: పరేడ్‌ గ్రౌండ్స్‌లో శాశ్వతంగా హైదరాబాద్‌ ముక్తి దివాస్ నిర్వహిస్తామన్న కిషన్‌ రెడ్డి

Kishan Reddy: పరేడ్‌ గ్రౌండ్స్‌లో శాశ్వతంగా హైదరాబాద్‌ ముక్తి దివాస్ నిర్వహిస్తామన్న కిషన్‌ రెడ్డి

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 17, 2024 11:00 AM IST

Kishan Reddy: హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా పరేడ్‌ గ్రౌండ్స్‌‌లో నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ ముక్తి దివాస్‌ను శాశ్వతంగా భారత ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను భావి తరాలకు అందిస్తామన్నారు.

హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం
హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం (HT_PRINT)

Kishan Reddy: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13నెలల 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చి, మువ్వన్నెల జెండా ఎగిరి, ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చగలిగారని కిషన్‌ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్‌ పేరెడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ మహత్తర పోరాట చరిత్రను మరుగున పెట్టే ప్రయత్నాలు చాలా కాలం జరిగాయని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకల్ని ప్రారంభించిందని, భవిష్యత్తులో కూడా పరేడ్‌ గ్రౌండ్స్‌లో హైదరాబాద్‌ ముక్తి దివాస్‌ నిర్వహిస్తామని ప్రకటించారు.

నిజాం వ్యతిరేకంగా సాగించిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే అపురూప ఘట్టమన్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా చేతికి అందిన ఆయుధాలతో నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తు చేశారు.

స్వాతంత్య్రానికి ముందు దేశంలోని ఇతర ప్రాంతాలు బ్రిటిష్ పాలనలో మగ్గిపోతే హైదరాబాద్ ప్రజలు నిజాం పాలనలో నలిగిపోయి మగ్గిపోయారన్నారు. ఖాసీం రజ్వీకి ఆయుధాలు ఇచ్చి అమాయక ప్రజలపై దాడులు చేయించారన్నారు. మహిళలతో నగ్నంగా బతుకమ్మలు ఆడించడం, దోపిడీలు, దొమ్మీలకు పాల్పడుతూ, అడ్డు అదుపులేని ఆకృత్యాలు సాగించారన్నారు. స్థానిక భాషల్ని, భారతీయ సంస్కృతిని నిర్ధాక్షిణ్యంగా అణిచివేశారని, భారతీయ భాషల్ని కాలికింద దూళిగా హేళన చేసి, తెలుగు భాషను అణగదొక్కి, ఉర్దూను బలవంతంగా ప్రజలపై రుద్దారని ఆరోపించారు.

మాడపాటి హనుమంతరావు వంటి వారు తెలుగును బతికించడానికి ఎంతో కృషి చేశారన్నారు. మతమార్పిడులకు నిరాకరిస్తే నాటి నిజాం ప్రైవేట్ ఆర్మీ అరాచకాలకు పాల్పడేవారని ఆరోపించారు. స్థానిక ప్రజల పండుగలపై అనేక ఆంక్షలు విధించేవారని, హిందూ పండుగలకు ఆంక్షలు అమలు చేసేవారని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

నిజాం కు వ్యతిరేకంగా ప్రజలు ప్రజలు కలిసికట్టుగా ఉద్యమించారని, నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరి వేశారని,దానిని వెయ్యి ఉరుల మర్రి చెట్టుగా ప్రజలు గుర్తు పెట్టుకున్నారన్నారు. కొమురం భీమ్ నిజాంకు వ్యతిరేకంగా ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో కలిపేందుకు నిజాం ప్రయత్నించిన విషయం చరిత్రలో అందరికి తెలుసన్నారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌, కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నారు. పలువురు కళాకారుల్ని కేంద్ర ప్రభుత్వం తరపున సన్మానించారు.