Ration Card e-KYC : రేషన్ కార్డుదారులకు అలర్ట్, మరో మూడు రోజుల్లో ముగియనున్న ఈ-కేవైసీ గడువు
26 February 2024, 11:07 IST
- Ration Card e-KYC : తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకూ 75 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేయగా మరో 25 శాతం మంది ఈ-కేవైపీ చేయించుకోవాల్సి ఉంది.
రేషన్ కార్డుదారులకు అలర్ట్
Ration Card e-KYC : తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ(Ration Card eKYC) ప్రక్రియ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. అసలైన లబ్దిదారులకే రేషన్, బోగస్ కార్డులు తొలగింపునకు కేంద్రం ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ముందుగా జనవరి 31 వరకు గడువు ఇవ్వగా, అనంతరం ఆ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగించారు. మరో మూడు రోజుల్లో ఈ గడువు ముగియనుంది. దీంతో రేషన్ కార్డు(Ration Cards) హోల్డర్స్ ఇంకా ఎవరైనా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే త్వరగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కేంద్రం ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేస్తుంది. రేషన్ కార్డు ఆధారంగా పలు ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేస్తారు.
ఇంకా 25 శాతం మంది పెండింగ్
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ-కేవైసీ(eKYC) ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో ఇప్పటి వరకూ 75 శాతం మంది రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తిచేసున్నారు. ఇంకా 25 శాతం ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. పలుకారణాలతో ఈ-కేవైసీ పూర్తి చేయించుకోనివాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ-కేవైసీ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లబ్దిదారులు రేషన్ షాపులో వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరులోపు 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసుకునేలా చూడాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. లబ్దిదారులు రేషన్ షాపులకు వెళ్లి ఈ-పోస్ యంత్రం ద్వారా బయోమెట్రిక్ నమోదు చేయాలి. మరణించిన వారు, పెళ్లి చేసుకుని మరో ప్రాంతానికి వెళ్లినవాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించని కారణంగా బియ్యం కోటా మిగిలిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టింది.
రేషన్ కార్డు ఈ-కేవైసీ ఇలా?
రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులు...రేషన్ షాపునకు(Ration Shops వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్, అందరూ వేలిముద్రలు సమర్పించాలి. మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేస్తారు. అనంతరం ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు ఈ-పోస్ మిషన్ నుంచి రసీదు వస్తుంది. రేషన్ కార్డుకు కలిగిన వాళ్లు రాష్ట్రంలో ఏ రేషన్ షాపు వద్దనైనా ఈ-కేవైసీ పూర్తిచేయవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి వెళ్లి వేలిముద్రలు వేయాల్సిన అవసరంలేదని అధికారులు తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చని తెలిపారు.
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
ఏపీలో రేషన్ కార్డుదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి 1 నుంచి రేషన్ లబ్దిదారులకు పౌరసరఫరాల శాఖ రాగి పిండిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పౌష్టికాహార భద్రత లక్ష్యంగా రాగిపిండి పంపిణీ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బలవర్థక ఆహారంగా రాగి పిండిని పంపిణీ చేయనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి కిలో రాగిపిండి ప్యాకెట్లను రేషన్ షాపుల్లో అందిస్తారు. రాగిపిండి బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.40 పైనే ఉండగా, రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు కిలో రూ.11కే పంపిణీ చేయనున్నారు.