Amrit Bharat Stations : తెలంగాణలో కొత్తగా 15 అమృత్ భారత్ స్టేషన్లు, ఈ నెల 26 ప్రధాని మోదీ శంకుస్థాపన
Amrit Bharat Stations : తెలంగాణలో 15 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు రూ.169 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈనెల 26న ప్రధాని మోదీ ఈ స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని వెల్లడించారు.
Amrit Bharat Stations : రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway)శుభవార్త చెప్పింది. తెలంగాణలో 15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు(Amrit Bharat Stations) నిర్మించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. రూ.230 కోట్లతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు అయన వెల్లడించారు. అమృత్ భారత్ స్టేషన్ల తో పాటు రూ.169 కోట్లతో 17 రైల్వే ఫ్లై ఓవర్లు , అండర్ పాసులు నిర్మించనున్నట్లు అరుణ్ జైన్ తెలిపారు. ఈనెల 26న రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం ఉంటుందని వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా 500లకు పైగా అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన
రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారని అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ 500 కు పైగా అమృత భారత్ రైల్వే స్టేషన్లకు భూమి పూజ, ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాసులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.621 కోట్లు ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అరుణ్ జైన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 40 అమృత్ భారత స్టేషన్ల అభివృద్ధికి ఖర్చు రూ. 2,245 కోట్లు ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రధాన నరేంద్ర మోదీ 21 అమృత్ భారత్ స్టేషన్లు అభివృద్ధికి భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు.
రూ.169 కోట్లతో....15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు
• జడ్చర్ల - రూ.10.94 కోట్లు.
• గద్వాల్ - రూ.9.49 కోట్లు.
• షాద్ నగర్ - రూ.9.59 కోట్లు.
• మేడ్చల్ - రూ.8.37 కోట్లు.
• మెదక్ - రూ.15.31 కోట్లు.
• ఉందా నగర్ - రూ.12.37 కోట్లు.
• బాసర - రూ.11.33 కోట్లు.
• యకుత్ పురా - రూ.8.53 కోట్లు.
• మిర్యాలగూడ - రూ.9.50 కోట్లు.
• నల్గొండ - రూ.9.50 కోట్లు.
• వికారాబాద్ - రూ.24.35 కోట్లు.
• పెద్దపల్లి - రూ.26.49 కోట్లు.
• మంచిర్యాల - రూ.26.49 కోట్లు.
• వరంగల్ - రూ.25.41 కోట్లు.
• బేగంపేట్ - రూ.22.57 కోట్లు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వేలను మరింత అభివృద్ధి చేస్తాం - కిషన్ రెడ్డి
2014 -15లో రూ. 258 కోట్లుగా ఉన్న తెలంగాణ రైల్వే బడ్జెట్(Railway Budget) కేటాయింపులను కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే 20 రెట్లు పెంచి 2024- 25 నాటికి రూ.5,070 కోట్లకు చేర్చడం తెలంగాణలో రైల్వే అభివృద్ధి మీద మోదీ ప్రభుత్వానికి నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. ఇంతవరకు ఎలాంటి రైలు సౌకర్యం లేని మెదక్, సిద్దిపేట లాంటి ప్రాంతాలకు కూడా కేంద్రం కొత్తగా రైలు సౌకర్యం అందుబాటులోకి తెచ్చిందని....ఆదాయపరంగా అనుకూలంగా కాకపోయినా మల్లన్న భక్తుల కోసం కొమరవెల్లిలో నూతన రైల్వే హాల్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టేషన్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఘనంగా నిర్వహించుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వేలలో అపూర్వమైన రీతిలో అభివృద్ధి సాధించడానికి మరింతగా కృషి చేస్తామని రాష్ట్రంలో రైల్వే రూపు రేఖలను సమూలంగా మార్చివేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం