Hyderabad Bonalu : హైదరాబాద్ లో బోనాల సందడి-నగరంలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు, వైన్ షాపులు బంద్
28 July 2024, 9:41 IST
- Hyderabad Bonalu : భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాలు దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. అలాగే నేడు, రేపు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
హైదరాబాద్ లో బోనాల సందడి-నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు, వైన్ షాపులు బంద్
Hyderabad Bonalu : హైదరాబాద్ లో బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. నేడు పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ లో బోనాల పండుగ సందర్భంగా నేడు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లాల్ దర్వాజా నుంచి మహాంకాళి లాల్ దర్వాజా టెంపుల్ రోడ్డు వైపు వచ్చే వాహనాలకు, చాంద్రాయణగుట్ట, కందికల్ గేట్ ఉప్పుగూడ నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదు. హిమ్మత్‌పురా, షంషీర్‌గంజ్ వైపు నుంచి లాల్ దర్వాజాకు వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు మళ్లించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహబూబ్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను ఇంజిన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్ బాన్ లేదా గోశాల మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. ఇంజిన్ బౌలి నుంచి వచ్చే ట్రాఫిక్ షంషీర్ గంజ్ వద్ద మళ్లిస్తారు. పంచ మొహల్లా చార్మినార్ నుంచి ట్రాఫిక్ నాగుల్ చింత వైపు అనుమతించరు. ఆ వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్, మిస్రిగంజ్ వైపు మళ్లిస్తారు. చాదర్‌ఘాట్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సాలార్‌జంగ్ మ్యూజియం రోడ్డు వైపు అనుమతించరు. ట్రాఫిక్ ను ఎస్జే రోటరీ వద్ద పురాణి హవేలీ రోడ్డు, శివాజీ బ్రిడ్జ్, చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు. మీర్‌చౌక్, మొఘల్‌పురా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హరిబౌలి వైపు అనుమతించరు. మీర్ కా దైరా వద్ద మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ వైపు మళ్లిస్తారు. ఖిల్వత్/మూసబౌలి నుంచి వచ్చే ట్రాఫిక్ లాడ్ బజార్ వైపు అనుమతించరు. మోతిగల్లి టీ జంక్షన్ వద్ద ఖిల్వత్ ప్లే గ్రౌండ్, మూసా బౌలి వైపు మళ్లిస్తారు. ఖిల్వత్ ప్లే గ్రౌండ్ నుంచి వచ్చే ట్రాఫిక్ హిమ్మత్‌పురా వైపు అనుమతించరు. ఓల్గా జంక్షన్ వద్ద ఫతే దర్వాజా, మిస్రిగంజ్ వైపు మళ్లిస్తారు.
వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతాలు
లాల్ దర్వాజాకు అలియాబాద్ వైపు నుంచి ద్విచక్ర వాహనాలపై వచ్చే భక్తులు తమ బైక్ లను అల్కా థియేటర్, దేవి ప్లైవుడ్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. హరిబౌలి గౌలిపురా వైపు నుంచి వచ్చే వాహనాలను సుధా థియేటర్ లైన్ లో పార్కింగ్ చేసుకోవాలి. మూసాబౌలి, మీర్ చౌక్ వైపు నుంచి వచ్చేవాహనదారులు తమ వాహనాలను చార్మినార్ బస్ టెర్మినల్ వద్ద నిలుపుకోవాలి. అంబారీ ఊరేగింపు సందర్భంగా మదీనా క్రాస్ రోడ్స్, ఇంజిన్ బౌలి, గుల్జార్ హౌస్, చార్మినార్, హిమ్మత్ పురా, నాగులుచింత రోడ్లపై ఎలాంటి వాహనాలను అమతించరు.
నేడు, రేపు మద్యం షాపులు బంద్
బోనాల దృష్ట్యా హైదరాబాద్ సిటీలో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. లాల్ దర్వాజా బోనాల నేపథ్యంలో నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
జులై 28, 29 తేదీల్లో హైదరాబాద్ సిటీలో బోనాల వేడుకలు జరగనున్నాయి. దీంతో నేడు, రేపు నగరంలోని అన్ని రకాల వైన్స్ షాపులు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ముఖ్యంగా సిటీ సౌత్ జోన్‌లోని చార్మినార్, హుస్సేనీ ఆలం, ఫలక్ నుమా, మొఘల్‌పురా, చైటినాక, షాలిబండ , మీర్‌చౌక్, డబ్బిర్ పుర ప్రాంతాల్లో 28వ తేదీన ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవుతాయి. కల్లు దుకాణాలు కూడా తెరుచుకోవు. 30వ తేదీన ఉదయం 6 గంటల వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయి. మరోవైపు సౌత్ ఈస్ట్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట , బండ్లగూడ వంటి ప్రాంతాల్లో జులై 28వ తేదీ (ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 24 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.