Chikoti Praveen : హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు సింహవాహిని మహంకాళి అమ్మవారివి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుండడంతో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటుచేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి ఓవరాక్షన్ చేశారు. చీకోటి ప్రవీణ్ తన ప్రైవేట్ సెక్యూరిటీతో ఆలయంలోకి వెళ్లారు. చీకోటి ప్రైవేటు సెక్యురిటీ సిబ్బందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద గన్స్ ఉండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమని పోలీసులు తెలిపారు. ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. వీరి వద్ద స్వాధీనం చేసుకున్న వెపన్స్‌కు లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
బోనాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మద్యం షాపులను బంద్ చేసింది. అయితే అక్రమమార్గంలో కొందరు మద్యం విక్రయిస్తున్నారు. కుత్బుల్లాపూర్, సుభాష్ నగర్, సూరారం, జీడిమెట్ల, సూరారం ప్రాంతాలలో జోరుగా బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. మద్యం షాపులు బంద్ అవ్వడంతో బెల్ట్ షాపు యజమానులు ఇష్టానుసారంగా మద్యం అమ్ముతున్నారు. ఇష్టారీతిన అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా.... అధికారుల స్పందించలేదని సమచారం.
పాతబస్తీ లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి, అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబించేలా బోనాలు నిర్వహించుకుంటున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏటా ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లష్కర్ బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు.