తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra : అక్రమ కట్టడాల వెనుక పెద్దోళ్ల హస్తం, పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టదు - కమిషనర్ రంగనాథ్

HYDRA : అక్రమ కట్టడాల వెనుక పెద్దోళ్ల హస్తం, పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టదు - కమిషనర్ రంగనాథ్

28 September 2024, 20:24 IST

google News
    • HYDRA : సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారని ఆరోపించారు. హైడ్రా అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తుందన్నారు. పేదలకు ఇబ్బంది పెట్టాలని హైడ్రా అభిమతం కాదన్నారు.
అక్రమ కట్టడాల వెనుక పెద్దోళ్ల హస్తం, పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టదు - కమిషనర్ రంగనాథ్
అక్రమ కట్టడాల వెనుక పెద్దోళ్ల హస్తం, పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టదు - కమిషనర్ రంగనాథ్

అక్రమ కట్టడాల వెనుక పెద్దోళ్ల హస్తం, పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టదు - కమిషనర్ రంగనాథ్

HYDRA : హైడ్రా అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కొన్ని కట్టడాలు కూల్చివేసినప్పుడు హైడ్రాను ప్రశంసించారని, ఇప్పుడు అవాస్తవాలు ప్రచారం చేస్తు్న్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందన్నారు. శనివారం హైదరాబాద్ ఆయన మీడియాతో మాట్లాడారు. అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయన్నారు. అమీన్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిపై గతంలో చర్యలు తీసుకున్నా మళ్లీ తిరిగి నిర్మించారన్నారు. ఆ ఆసుపత్రిని కూల్చిన సమయంలో అందులో పేషెంట్లు ఎవరూ లేరన్నారు.

ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశామని, దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజలు నివసిస్తున్న భవనాలను ఎక్కడా కూల్చలేదని తెలిపారు. ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు భవనాలను ఖాళీ చేయడంలేదన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి భవనాలు కట్టిన వారికి సరైన సమయం ఇచ్చిన తర్వాతే ఆ ఆక్రమణలు కూల్చివేస్తున్నామన్నారు. కూకట్‌పల్లి నల్ల చెరువులో ఆక్రమణలు కూల్చివేశామన్నారు.

పేదలు, మధ్య తరగతి ప్రజలు చెరువులను ఆక్రమించరని, అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారని రంగనాథ్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సీఎం హైడ్రాను తీసుకొచ్చారన్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేస్తూ ఊరుకోమన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెరువులు నాలాలను కాపాడుకోలేమన్నారు. పేదలకు ఇబ్బంది పెట్టాలని హైడ్రా అభిమతం కాదన్నారు. ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సంబంధించిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. విద్యా సంవత్సరం నష్టపోతారనే వాటిపై చర్యలు తీసుకోలేదన్నారు.

హైడ్రాను బూచిగా చూపించి ప్రజలను భయపెడితే భవిష్యత్‌ తరాలకు నష్టపోతాయని కమిషనర్ రంగనాథ్ అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములను ఎవరు కాపాడలేరన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ 111 జీవో పరిధిలో ఉందని, అది హైడ్రా పరిధిలోకి రాదన్నారు. అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న హైడ్రా కమిషనర్, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు బడా వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారన్నారు. N కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కనే ఉన్న గుడిసెలను తొలగించలేదన్నారు. కొందరు అక్రమ వ్యాపారాలు చేస్తూ… హైడ్రా వచ్చినప్పుడు కిరోసిన్, పెట్రోల్ తో ఆందోళన చేస్తున్నారన్నారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందస్తు సమాచారం ఇచ్చామని రంగనాథ్ వెల్లడించారు. కొందరు సీరియస్‌గా తీసుకోలేదని, వారిని ఖాళీ చేయించిన తరువాతనే కూల్చివేతలు స్టార్ట్ చేశామన్నారు.

హైడ్రా అనేది ఒక బూచిగా చూపించి బుచ్చమ్మను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. హైడ్రా అంటే భరోసా.. అయితే కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తున్నారు అది సరైంది కాదన్నారు. పేదవాళ్లను ఇబ్బందులు గురిచేసేందుకు హైడ్రా ఉండదన్నారు. ఇప్పటి వరకు హైడ్రా ఖాళీగా ఉన్న భవనాలు మాత్రమే కూల్చివేసిందన్నారు. పేదల పట్ల ఒకలా, పెద్దోళ్ల పట్ల మరోలా హైడ్రా వ్యవహరించదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన పెద్ద వాళ్లే లక్ష్యంగా హైడ్రా కూల్చివేతలు చేస్తుందన్నారు. హైడ్రా సైలెంట్ గా లేదని తన పని తానూ చేస్తుందన్నారు.

చిన్న వర్షాలకే హైదరాబాద్ లో ముంపు

మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. గతంలో మూసీకి వరదలు భారీగా వచ్చేవని, అప్పట్లో నిర్వాసితులను తరలించారన్నారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపునకు గురవుతోందన్నారు. ఖైరతాబాద్‌లో 20 నిమిషాల్లో 9 సె.మీ కుపైగా వర్షపాతం నమోదైందన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం కోటి మంది నివసిస్తు్న్నారన్నారు. మూసీ పరివాహక ప్రాంతం మురికికూపంలా మారిందని, దానిని మార్చాలన్నారు. మూసీకి వరదలు వస్తే ప్రజలే ఇబ్బంది పడతారన్నారు. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకొని క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తామన్నారు.

తదుపరి వ్యాసం