AV Ranganath : అక్కడ ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేయొద్దు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన.. 8 ముఖ్యాంశాలు-hydra commissioner av ranganath key announcement regarding the purchase of houses and plots in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Av Ranganath : అక్కడ ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేయొద్దు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన.. 8 ముఖ్యాంశాలు

AV Ranganath : అక్కడ ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేయొద్దు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన.. 8 ముఖ్యాంశాలు

Basani Shiva Kumar HT Telugu
Sep 08, 2024 04:02 PM IST

AV Ranganath : హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించింది. ఎఫ్టీఎల్‌, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు.. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని స్పష్టం చేసింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని కమిషనర్ రంగనాథ్ సూచించారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (X)

హైదరాబాద్ నగరంలో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేయాలని.. వాటికి భవిష్యత్తు ఉంటుందని చాలా మంది అనుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్మును హైదరాబాద్‌లోని భూములు, ప్లాట్లపై పెడతారు. అలాంటి వారికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక సూచన చేశారు. హైదరాబాద్ నగరంలో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

'నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోం. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నాం. ఇప్పటికే నిర్మించి నివాసముంటున్న ఇళ్లను కూల్చివేయడం లేదు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దు. కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ఇబ్బందులు పడొద్దు' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సూచించారు.

హైడ్రా ప్రకటనలో కీలకాంశాలు..

1.ఎఫ్‌టిఎల్, బఫర్‌ జోన్‌లో నిర్మించిన కట్టడాలు ఆక్రమించినప్పటికీ.. ఇల్లు, నివాసం ఏదీ కూల్చివేయడం లేదు.

2.ఎఫ్టీఎల్, బఫర్‌ జోన్‌లోకి వచ్చే కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తాం. మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్‌లోని మల్లంపేట్ చెరువులో ఈ రోజు కూల్చిన నిర్మాణాలు నిర్మాణంలో ఉన్నాయి. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు.

3.అమీన్‌పూర్‌లో కూల్చివేసిన నిర్మాణాలు.. ప్రధానంగా కాంపౌండ్ గోడలు, గదులు, షెడ్‌లు ఆక్రమణకు గురయ్యాయి. కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన కొన్ని షెడ్లను కూల్చివేశాం. ఏ వ్యక్తి ఆక్రమించిన ఇల్లు, నివాసం కూల్చలేదు.

4.మల్లంపేట చెరువు, దుండిగల్‌లో కూల్చిన 7 విల్లాలు ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో ఎవరూ లేరు. భవన నిర్మాణ అనుమతులు లేకుండా ఎఫ్‌టిఎల్‌లో ఉన్నాయి. బిల్డర్ విజయలక్ష్మి (స్థానికంగా లేడీ డాన్ అని పిలుస్తారు). ఆమెపై అనేక క్రిమినల్ కేసులు బుక్ అయ్యాయి.

5.సున్నం చెరువులోని నిర్మాణాలను గతంలో కూడా కూల్చివేశారు. కానీ.. వాటిని మళ్లీ తిరిగి నిర్మిస్తున్నారు. అందుకే వాటిని కూల్చివేశాం.

6.బిల్డర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి.

7.ఎవరి ఇళ్లు కూల్చబోమని హైదరాబాద్ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం.

8.ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న ఇల్లు, ఫ్లాట్, భూమిని కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరుతున్నాము. అటువంటి ఆస్తుల కొనుగోలుదారులకు సంబంధించి ఏదైనా సందేహం ఉంటే.. వారు హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌ను గానీ.. అధికారులను గానీ సంప్రదించాలి.