Karimnagar : పోలీస్ వర్సెస్ పొలిటికల్..! సీపీపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫైర్ - అసలేం జరుగుతోంది..!-congress mla kavvampally satyanarayana serious comments on karimnagar cp abhishek mohanty ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : పోలీస్ వర్సెస్ పొలిటికల్..! సీపీపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫైర్ - అసలేం జరుగుతోంది..!

Karimnagar : పోలీస్ వర్సెస్ పొలిటికల్..! సీపీపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫైర్ - అసలేం జరుగుతోంది..!

HT Telugu Desk HT Telugu
Sep 06, 2024 06:55 PM IST

కరీంనగర్ సీపీపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. దళిత సామాజికవర్గానికి చెందిన సీఐలను సీపీ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సీపీ తీరుపై స్పీకర్ తో పాటు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఎంకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవతున్నారు.

పోలీస్ వర్సెస్ పొలిటికల్ వార్....!
పోలీస్ వర్సెస్ పొలిటికల్ వార్....!

కరీంనగర్ రాజకీయాలు పోలీస్ వర్సెస్ పొలిటికల్ అన్నట్లుగా మారాయి. అధికార విపక్షాల మధ్య విమర్శలు అధికారుల మెడకు ఉచ్చుబిగిసే పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని దళిత ఎమ్మెల్యేల పట్ల వివక్షత చూపుతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం తోపాటు పలువురు  స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.‌ 

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ప్రస్తావిస్తు మానకొండూర్ సిఐ సదన్ కుమార్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంతర్గతంగా జరిగే విషయాలు బహిర్గతం కావడంతో పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. దీంతో సిఐ సదన్ కుమార్ లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోగా రాజకీయం మరింత రంజుకుంది.

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి పై పైర్ అయ్యారు. దళిత సిఐలను సిపి వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేను కావడంతో తన మాటను సైతం ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

సీపీ తీరుపై ఇప్పటికే స్పీకర్, డిజిపి దృష్టికి తీసుకెళ్ళిన కవ్వంపల్లి, దళితుల పట్ల వివక్షత చూపే అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరేందుకు సిద్ధమయ్యారు. కవ్వంపల్లి ఫిర్యాదుతో సిపి సీరియస్ కావడంతో మానకొండూరు సిఐ సదన్ కుమార్ లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళి పోయారు.‌ సిపి వైఖరితో దళిత సిఐలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత సిఐని తప్పించి తనకు అనుకూలమైన అగ్రవర్ణానికి చెందిన సిఐకి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. దళితులం కావడంతోనే వివక్షత చూపుతున్నారంటూ... సిపి తీరుపై కవ్వంపల్లి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరూపిస్తే రాజకీయాల స్వస్తి…!

పోలీసుశాఖలో పోస్టింగ్ ల పేరిట తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించగలిగితే రాజకీయాలను నుంచి వైదొలుగుతానని కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇటీవల సీఐ పోస్టింగ్ కోసం తాను 20 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని కవ్వంపల్లి డిమాండ్ చేశారు. నిరూపించలేకుంటే ఇక ముందు తప్పుడు ఆరోపణలు చేయకుండా నోరుమూసుకొని ఉండాలని, లేకుంటే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. 

ఓటమిని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బట్టకాల్చి మీదేసే విధంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్ కు వెళ్లేది నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించుకోవడానికే తప్ప బాలకిషన్ మాదిరిగా డబ్బుల కోసం పైరవీలు చేయడం లేదన్నారు. 

వరదల సమయంలో తాను గ్రామాల్లో పర్యటించానని కవ్వంపల్లి చెప్పుకొచ్చారు. తోటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే మత్స్యకారుడు వాగులో కొట్టుకుపోయిన ప్రదేశాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించి గాలింపు చర్యలు ముమ్మరం చేయించానన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో వరద తాకిడికి గురైన గ్రామాలను సందర్శించామన్నారు. ఇవాళ మృతుడు లక్ష్మయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేసినట్టు ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు. వరదల వేళ తాను హైదరాబాద్ కే పరిమితమైనట్టుగా రసమయి సాగించిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

సీపీతో వైరం లేదు - ఎమ్మెల్యే కవ్వంపల్లి

కరీంనగర్ పోలీస్ కమిషనర్ తో తనకు ఎలాంటి వైరం లేదని, సీపీ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని ఎమ్మెల్యే కవ్వంపల్లి చెప్పారు. మంచి చేస్తే సమర్థిస్తానని, చెడు చేస్తే వ్యతిరేకిస్తానని  స్పష్టం చేశారు.

కమిషనరేట్ పరిధిలో దళిత సీఐ పోస్టింగ్ ల విషయంలో సీపీ వైఖరిని మాత్రం తప్పుపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు దళిత సామాజిక వర్గానికి చెందిన నలుగురు సీఐలను జాయిన్ కాకుండా సీపీ వెనక్కి పంపించారన్నారు. సీఐలు కిరణ్, రవి కుమార్, రమేష్, సదన్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారేనని… తమ జాతి బిడ్డలపై జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పాల్సి వచ్చిందన్నారు. 

దళిత సీఐలు కష్టపడి పోస్టింగ్ లు తెచ్చుకుంటే సీపీ తిప్పి పంపడం, ఐజీ ఉత్తర్వులు సైతం ధిక్కరించి సీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ముఖ్యమంత్రి, డీజీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రసమయి… రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని సీఐగా నియమించుకోగా, ఇప్పుడు తాను దళిత సామాజికవర్గానికి చెందిన సీఐలు ఉండాలని కోరుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పోస్టింగుల కోసం లెటర్లు ఇచ్చి డబ్బులు తీసుకునే వారని, కాంగ్రెస్ పాలనలో మాత్రం ఆ సంస్కృతికి చరమగీతం పాడామన్నారు.

కౌశిక్ రెడ్డికి వార్నింగ్…!

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కల్లుతాగిన కోతిలా చిందులు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఈ వ్యవహారానికి ఫోన్ ట్యాంపింగ్ ను ముడిపెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నోరు తెరిస్తే బాగుండదని కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. మీ చరిత్రలు తెలియందెవరికని ప్రశ్నించారు. ఎస్ఐలు, సీఐల దగ్గర పండుగలు, పబ్బాల పేరుతో పొట్టేళ్ల తెప్పించుకొని దావతులు చేసుకొనే కౌశిక్, రసమయిలు సుద్ద పూసల్ల మాట్లాడటం విడ్డూరంగా ఉందని డాక్టర్ కవ్వంపల్లి విమర్శించారు.

బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు, బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బందుల పాల్జేసేవారని డాక్టర్ కవ్వంపల్లి ఆరోపించారు. మానకొండూర్ నియోజవర్గంలో అనేక మందిపై ఈ తరహా కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదన్నారు. అలాగే అక్రమ కేసులు నమోదు చేయడం లేదన్నారు. గులాబీ నేతలు, కార్యకర్తలపై ఏమైన కేసులు నమోదై ఉంటే అవి వారు చేసిన తప్పుడు పనులు వల్ల నమోదైనవే తప్ప బనాయించిన తప్పుడు కేసులు ఎంతమాత్రం కావని ఆయన స్పష్టం చేశారు.

రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు