Karimnagar News : కరీంనగర్ జడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు, సీఈవో డీఈవోపై రేపు ప్రివిలేజ్ మూవ్-karimnagar zp meeting rukkus mla kaushik reddy complaint on zp ceo moves privilege motion ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar News : కరీంనగర్ జడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు, సీఈవో డీఈవోపై రేపు ప్రివిలేజ్ మూవ్

Karimnagar News : కరీంనగర్ జడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు, సీఈవో డీఈవోపై రేపు ప్రివిలేజ్ మూవ్

HT Telugu Desk HT Telugu
Jul 03, 2024 10:22 PM IST

Karimnagar News : కరీంనగర్ జడ్పీ సమావేశంలో జరిగిన పరిణామాలు, కలెక్టర్ ను అడ్డుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే కేసు నమోదు చేశారని, జడ్పీ సీఈవోపై కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఈవో, డీఈవోపై ప్రివిలేజ్ మూవ్ చేస్తున్నామన్నారు.

కరీంనగర్ జడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు
కరీంనగర్ జడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

Karimnagar News : కరీంనగర్ జడ్పీ సమావేశంలో జరిగిన పరిణామాలపై రాజకీయం దుమారం రేగుతోంది. కలెక్టర్ ను అడ్డుకున్నారని జడ్పీ సీఈవో ఫిర్యాదుతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం కలకలం సృష్టిస్తుంది. కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తూ అధికారుల వైఖరిని తప్పుపడుతున్నారు.‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి గంగుల కమలాకర్ కరీంనగర్ లో పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతిని కలిసి జరిగిన పరిణామాలపై వివరించారు. జడ్పీ సీఈవోపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

జడ్పీ ఛైర్ పర్సన్ విజయ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల సమస్యలు, దళిత బిడ్డలకు మంజూరు కావాల్సిన దళిత బంధు రెండో విడత నిధుల విషయంపై మాట్లాడానని చెప్పారు. పేద ప్రజల సంక్షేమం గురించి సమస్యను లేవనెత్తి పరిష్కారం చూపాలని అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత గల అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారని అధికారుల తీరుపై నిరసన తెలిపితే నాపై జడ్పీ సీఈవో ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రజాసమస్యలపై సమావేశంలో చర్చించే హక్కు తనకు ఉండగా నా హక్కును కాలరాసేలా, విధులకు ఆటంకం కలిగించి నన్ను కించపరుస్తూ నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా జడ్పీ సీఈవో వ్యవహరించారని ఆరోపించారు. జడ్పీ సీఈవో శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు స్వీకరించిన సీపీ

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి జడ్పీ సీఈవోపై ఇచ్చిన ఫిర్యాదులు సీపీ స్వీకరించారు. విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. సీపీ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. తాను కలెక్టర్ ను అడ్డుకోలేదని డీఈవో నోటీస్ పై సమాధానం చెప్పాలని అతనిపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. జడ్పీ ఛైర్ పర్సన్ అనుమతి లేకుండా సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేసే అర్హత లేదన్నారు. న్యాయం చేయండని కలెక్టర్ ను అడిగానే తప్ప ఎక్కడ అధికారుల విధులకు ఆటంకపర్చలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాయలో పడి అధికారులు ఆగం కాకండని కోరారు. ఇల్లీగల్ పనులు చేస్తూ అధికారులను మంత్రి పొన్నం ఇరికిస్తున్నారని ఆరోపించారు. జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఈవో జనార్థన్ రావు పై ప్రివిలేజ్ మూవ్ చేస్తున్నానని చెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీలో అడుగుతాం..నిలదీస్తామని తెలిపారు. చిగురుమామిడీ జడ్పీటీసీ రౌడీషీటర్ అని అలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడితే నిరసన వ్యక్తం చేశానని తెలిపారు. తనపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

ప్రశ్నించే గొంతు నొక్కుతారా?.. గంగుల కమలాకర్

ప్రజా సమస్యలపై చర్చించే వేదిక జిల్లా పరిషత్ అని...జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడితే కేసు పెడతారా అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. జిల్లా పరిషత్తులో ఎమ్మెల్యేకు మాట్లాడే హక్కు లేదా? అన్నారు. మాట్లాడే అవకాశం లేనప్పుడు జిల్లా పరిషత్ సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. జడ్పీలో మాట్లాడిన ఎమ్మెల్యేపై సీపీకి ఫిర్యాదు చేసిన జడ్పీ సీఈఓ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వివక్షత చూపవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యేపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జరిగిన పరిణామాలపై విచారణ జరిపించాలని కోరుతున్నామని తెలిపారు.

రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం