Gangula Kamalakar : గంగుల కమలాకర్ దారెటు, పార్టీ మారాలని అనుచరుల ఒత్తిడి-karimnagar mla gangula kamalakar may leave brs join either congress or bjp ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gangula Kamalakar : గంగుల కమలాకర్ దారెటు, పార్టీ మారాలని అనుచరుల ఒత్తిడి

Gangula Kamalakar : గంగుల కమలాకర్ దారెటు, పార్టీ మారాలని అనుచరుల ఒత్తిడి

HT Telugu Desk HT Telugu
Jun 15, 2024 10:20 PM IST

Gangula Kamalakar : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ మారాలంటూ ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీలో చేరతారనే చర్చ మొదలైంది.

గంగుల కమలాకర్ దారెటు, పార్టీ మారాలని అనుచరుల ఒత్తిడి
గంగుల కమలాకర్ దారెటు, పార్టీ మారాలని అనుచరుల ఒత్తిడి

Gangula Kamalakar : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయా? ఆ పార్టీలో ఇముడలేక పోతున్నారా? పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తుంది. మరీ గంగుల దారి ఎటు అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరి చెయెత్తి జై కొడుతారా లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరి సేప్ సైడ్ అవుతారా? అనేది సస్పెన్స్ గా మారింది.

అనుచరులు కాంగ్రెస్ బీజేపీలో చేరిక

అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోలేక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. పార్లమెంట్ ఫలితాలతో పార్టీ పరిస్థితి మరి అధ్వానంగా తయారయ్యింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పురుడుపోసుకున్న కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు పలుచనయ్యింది. ఇప్పటికే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పదుల సంఖ్యలో అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీలో చేరగా అదే బాటలో మరికొందరు ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీమంత్రి గంగుల కమలాకర్ సైతం పార్టీ మారే యోచనలో ఉన్నారు. ఇప్పటికే అయన అనుచరులు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ లు డజన్ మంది కాంగ్రెస్ లో మరో ముగ్గురు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేను సైతం పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారు. మంత్రి పదవి ఇచ్చి ప్రాధాన్యత కల్పించిన బీఆర్ఎస్ ను వీడలేక మారుతున్న రాజకీయ పరిణామాలతో వేగలేక గంగుల కమలాకర్ సతమతమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు తన అనుచరులు కాంగ్రెస్ బీజేపీలో చేరడంతో ఆ రెండు పార్టీల నేతలు గంగుల రాకను స్వాగతిస్తున్నారు. అయితే గంగుల ఏటు తేల్చుకోలేక మారుతున్న రాజకీయ పరిణామాలు మింగుడుపడడం లేదట.

వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల

గంగుల కమలాకర్ కరీంనగర్ కు ఒక ఐకాన్ గా మారారు. వరుసగా నాలుగు సార్లు కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన గంగుల తాజా రాజకీయ పరిణామాలు అతనికి మింగుడు పడడం లేదు. టీడీపీ తరపున ఒకసారి, బీఆర్ఎస్ తరపున మూడు సార్లు వరుసగా నాలుగు సార్లు కరీంనగర్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గంగుల నిలిచారు. అలాంటి గంగుల రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఆచూతూచీ అడుగులు వేస్తున్నారు. భూ అక్రమదందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఇప్పటికే కరీంనగర్ లో గంగుల అనుచురులు పలువురు కార్పొరేటర్ లు కేసుల పాలై జైలు జీవితం గడిపారు. గంగుల కుటుంబం గ్రానైట్ వ్యాపారంలో ఆరితేరగా అతని ఆర్థిక మూలాలపై దెబ్బతీసేలా అటు కేంద్రం సైతం గ్రానైట్ వ్యాపారంపై నిఘా పెట్టి సీబీఐ, ఈడీ దాడులు చేయించింది. గంగులను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చుట్టుముట్టడంతో రాజకీయంగా డీలా పడ్డారు. ఇలాంటి పరిస్థితిలో గంగుల పార్టీ మారితేనే భవిష్యత్తు ఉంటుందనే భావన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతుంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ముహుర్తం కోసం ఎదురుచూపులు

అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసి ఇక స్థానిక సంస్థల ఎన్నికలు మిగలడంతో అధికార పార్టీల హవా కొనసాగే అవకాశాలు ఉండడంతో అనుచరులు ఒక్కొక్కరు పార్టీ మారుతున్నారు. గంగుల సైతం పార్టీని మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరితే బాగుంటుందని ఆరా తీసే పనిలో అనుచరులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీలో చేరితే చేకూరే ప్రయోజనాలు ఏమిటనే అంశంపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న గంగుల కాంగ్రెస్ లో చేరితే బాగుంటుందని కొందరు బావిస్తే మరికొందరు మాత్రం కాంగ్రెస్ కంటే బీజేపీలో చేరితేనే గంగుల సేప్ సైడ్ గా ఉంటారని అభిప్రాయపడుతున్నారు. గంగల మదిలో ఏముందో కానీ అనుచురల హడావిడితో త్వరలోనే గంగుల మనస్సు మార్చుకుని పార్టీ మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్లు గంగుల గ్యాంగ్ భావిస్తుంది. వచ్చే రెండు మాసాల్లో కరీంనగర్ లో రాజకీయంగా పెనుమార్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.

HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి

WhatsApp channel

సంబంధిత కథనం