Gangula Kamalakar : బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లను మించిన యాక్టర్ బండి సంజయ్- గంగుల కమలాకర్
Gangula Kamalakar : తుల ఉమ టికెట్ ను బండి సంజయ్ రూ.20 కోట్లకు అమ్ముకున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బండి సంజయ్ యాక్టింగ్ బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ లను మించిపోయిందని ఎద్దేవా చేశారు.

Gangula Kamalakar : భారతీయ జనతా పార్టీలో టికెట్లు ఇస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన వ్యక్తి బండి సంజయ్ అని, ఆ అవినీతి సొమ్ముతో గెలిచేందుకు మళ్లీ వస్తున్నారని కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్ళు, తెలంగాణ సంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ బోనాలతో గంగులకు ఘన స్వాగతం పలికారు. మంత్రి గంగుల ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ...బీసీ బిడ్డ తుల ఉమ పోటీ చేసేందుకు సిద్ధం కాగా ఆమెకు వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తికి 20 కోట్ల రూపాయలకు టికెట్ బండి సంజయ్ అమ్ముకున్నారని ఆరోపించారు. సంజయ్ ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక డ్రామా ఆడి ఓట్లు దండుకోవాలని చూస్తారన్నారు. ఆయన యాక్టింగ్ బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లను మించిపోయిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు భూకబ్జాదారులు
భూ మాఫియాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, ఆయనకు సర్పంచ్ గా అవకాశం ఇస్తేనే ఇండ్ల స్థలాలు, భూములు కబ్జాలు చేసి కోట్లు కూడబెట్టారని మంత్రి గంగుల ఆరోపించారు. కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే అయితే మీ భూములు, ప్రభుత్వ భూములు కూడా కబ్జాకు గురవుతాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు భూమాఫియాలో భాగస్వాములు అన్నారు. తాను వ్యాపారాల్లో లాభపడి డబ్బులు సంపాదిస్తే, బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఏ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కబ్జాల వల్ల బొమ్మకల్ గ్రామంలోని భూ రికార్డులు సీబీసీఐడీ వద్ద ఉండే దుస్థితి దాపురించిందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థికి 12 ఇండ్లు
భూకబ్జాలకు పాల్పడి 12 ఇండ్లు కట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి గ్రామపంచాయతీ భవనం కట్టలేకపోవడం సిగ్గుచేటని అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చోవడం సిగ్గుగా ఉందన్నారు గంగుల. ఎంపీగా బండి సంజయ్ ను గెలిపిస్తే ఒక్క రోజు ఏ గ్రామానికి రాని వ్యక్తి మళ్లీ ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని, మహిళలు నిలదీయాలని కోరారు. రానున్న ఎన్నికలు మీ బిడ్డల భవిష్యత్ ను సూచించే ఎన్నికలు అని, ఒక్క ఓటు తప్పు జరిగితే మీ పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రిపోర్టర్: గోపికృష్ణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా