Karimnagar : కరీంనగర్ జడ్పీ సమావేశం రసాభాస- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ జడ్పీటీసీ వ్యక్తిగత దూషణలు-karimnagar zptc meeting brs mla kaushik reddy congress zptc criticizes each other ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : కరీంనగర్ జడ్పీ సమావేశం రసాభాస- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ జడ్పీటీసీ వ్యక్తిగత దూషణలు

Karimnagar : కరీంనగర్ జడ్పీ సమావేశం రసాభాస- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ జడ్పీటీసీ వ్యక్తిగత దూషణలు

HT Telugu Desk HT Telugu
Jul 02, 2024 08:11 PM IST

Karimnagar ZPTC Meeting : కరీంనగర్ జడ్పీటీసీ సమావేశం రసాభాసగా మారి అర్థాంతరంగా ముగిసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ జడ్పీటీసీ మధ్య మాటల యుద్ధం జరిగింది.

కరీంనగర్ జడ్పీ సమావేశం రసాభాస- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ జడ్పీటీసీ
కరీంనగర్ జడ్పీ సమావేశం రసాభాస- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ జడ్పీటీసీ

Karimnagar ZPTC Meeting : కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నిరసనలు ఆందోళనలతో అట్టుడికింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ జడ్పీటీసీ అన్నట్లు సమావేశం వ్యక్తిగత దూషణలు విమర్శలు ప్రత్యారోపణలతో గందరగోళంగా ముగిసింది.

జడ్పీ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన సమయానికి హాజరు కాలేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తో కలెక్టర్ పమేలా సత్పతి, జడ్పీటీసీలు ఎంపీపీలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంకాగానే విద్యాశాఖపై తన నియోజకవర్గంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే డీఈవో జనార్ధన్ రావు నోటీస్ ఇవ్వడం ఏంటని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.‌ కలెక్టర్ సమాధానం చెప్పకుండా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయేందుకు యత్నించగా ఎమ్మెల్యేతోపాటు జడ్పీటీసీలు అడ్డుకున్నారు. దారికి అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పినప్పటికీ వెంటనే సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. చివరకు పోలీసుల జోక్యంతో కలెక్టర్ వెళ్లిపోగా ఎమ్మెల్యే తోపాటు సభ్యులు ఛైర్ పర్సన్ పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యే వర్సెస్ జడ్పీటీసీ

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన చిగురుమామిడి జడ్పీటీసీ రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్, జడ్పీటీసీ రవీందర్ మధ్య వాగ్వాదం జరిగింది. వ్యక్తిగత దూషణలతో సభ గందరగోళంగా మారింది. జడ్పీ ఛైర్మన్ సర్ది చెప్పినప్పటికీ ఎమ్మెల్యే జడ్పీటీసీ నువ్వెంతా.. అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు పరుష వ్యాఖ్యలతో ప్రత్యారోపణలు చేసుకున్నారు. దళిత మహిళా ఛైర్ పర్సన్ కావడంతోనే అవమానించేలా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ డీఈవోను సస్పెండ్ చేసే వరకు కదలమని ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభ్యులు భీష్మించారు. సమావేశం గందరగోళంగా మారడంతో ఛైర్ పర్సన్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్

ఈనెల 5న జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగుస్తుంది. చివరి సమావేశంగా ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. ఎమ్మెల్యే సెంటర్ అట్రాక్షన్ గా నిలిచి డీఈవోను టార్గెట్ గా చేసుకొని సభ అర్ధాంతరంగా ముగిసేలా ఆందోళనకు దిగారు. జిల్లా పరిషత్ లో 16 మంది జడ్పీటీసీలు ఉండగా ఏకపక్షంగా 16 మంది బీఆర్ఎస్ కు చెందిన జడ్పీటీసీలు ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చిగురుమామిడి జడ్పీటీసీ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే దూకుడుకు కళ్లెం వేసేలా వాగ్ధాది చేశారు. ఛైర్ పర్సన్ తో సహా సభ్యులంతా బీఆర్ఎస్ వాళ్లే ఉన్నప్పటికీ ఏ సమస్య పైనా చర్చించకుండా ఎమ్మెల్యే ఆందోళనతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీలు ఆందోళన కొనసాగిస్తుండగానే ఛైర్ పర్సన్ సమావేశాన్ని ముగించి భోజనానికి వెళ్లిపోయారు.

జడ్పీ ఆత్మీయ సన్మానానికి హాజరైన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

నిరసనలు ఆందోళనలతో జడ్పీ చివరి సమావేశం అర్ధాంతరంగా ముగిసిన కాసేపటికి మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకున్నారు. భోజన విరామం తర్వాత జడ్పీ పాలకవర్గం గడువు ముగుస్తుండడంతో జడ్పీటీసీల ఆత్మీయ సన్మాన కార్యక్రమం మంత్రి పొన్నం సమక్షంలో నిర్వహించారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉప్పు నిప్పుల ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సన్మాన వేదికపై ఆశీనులై జడ్పీటీసీలను ఎంపీపీలను సన్మానించారు. పదవుల్లో ఉన్నన్ని రోజులు రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వకంగా, అరోగ్యకరమైన వాతావరణంలో పనిచేసిన సభ్యులు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు పొందాలని మంత్రి పొన్నం అకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా సహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా ఓపెన్ గా చెప్పుకోవచ్చని తెలిపారు. భవిష్యత్ లో స్థానిక సంస్థలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం నేతృత్వంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. తన రాజకీయ గురువు జువ్వాడి చొక్కారావు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారని తాను సహకార రంగం నుంచి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగానని తెలిపారు. ప్రస్తుత జడ్పీటీసీ, ఎంపీపీలు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు పొంది ప్రజాసేవ చేయాలని సూచించారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం