ZPTC Husband: పోలీస్ స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త చిందులు.. సోషల్ మీడియాలో వైరల్.. సిబ్బందిపై వేటు వేసిన ఎస్పీ-zptcs husband dance in the police station viral on social media ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Zptc Husband: పోలీస్ స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త చిందులు.. సోషల్ మీడియాలో వైరల్.. సిబ్బందిపై వేటు వేసిన ఎస్పీ

ZPTC Husband: పోలీస్ స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త చిందులు.. సోషల్ మీడియాలో వైరల్.. సిబ్బందిపై వేటు వేసిన ఎస్పీ

Sarath chandra.B HT Telugu
Apr 16, 2024 07:29 AM IST

ZPTC Husband: అధికార పార్టీకి చెందిన ఓ జడ్పీటీసీ భర్త పోలీస్ స్టేషన్ లోనే చిందులేశారు. సినిమా పాటలు పెట్టుకుని పోలీస్ సిబ్బంది ముందే స్టెప్పులేశారు. ఆ విషయం వైరల్‌ కావడంతో సిబ్బందిపై వేటు పడింది.

పోలీస్‌ స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త డాన్సులు, ఇద్దరు పోలీసులపై ఎస్పీ వేటు
పోలీస్‌ స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త డాన్సులు, ఇద్దరు పోలీసులపై ఎస్పీ వేటు

ZPTC Husband: పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో జడ్పీటీసీ భర్త Dance డాన్సులు చేస్తున్న వీడియోలు Videos వైరల్‌గా మారడంతో సిబ్బందిపై వేటు పడింది. పోలీసులు స్టేషన్ లో డ్యాన్సులు చేస్తున్న జడ్పీటీసీ భర్తను అడ్డుకోవాల్సింది పోయి.. వీడియో తీస్తూ టైం పాస్ చేశారు. చివరకు వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీస్ స్టేషన్ లో చిందులు వేయడాన్ని సీరియస్ తీసుకున్న జిల్లా ఎస్పీ సంబంధిత సిబ్బందిపై శాఖా పరమైన చర్యలకు ఉపక్రమించారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. జయశంకర్ భూపాలపల్లి Jayasankar Bhupalapalli జిల్లా మహదేవ్ పూర్ Mahadevpur మండల జడ్పీటీసీ సభ్యురాలిగా గుడాల అరుణ పని చేస్తున్నారు. భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరుణ భర్త శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలోనే పోలీస్ అధికారులు, సిబ్బందితో పరిచయాలు పెంచుకుని వారితో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా, వారిని మేనేజ్ చేస్తూ దందాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇదిలాఉంటే పోలీసులతో చనువుగా ఉండే ఆయన సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిబ్బంది ముందే నాగార్జున సినిమా పాట పెట్టుకుని స్టెప్పులేశారు.

దానిని అక్కడున్న సిబ్బంది వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు. అనంతరం తాను పోలీస్ స్టేషన్ లో చేసిన డ్యాన్స్ వీడియోను గుడాల శ్రీనివాస్ తన స్నేహితులకు వాట్సాప్ లో షేర్ చేశారు. మహదేవపూర్ మండలంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ వీడియో కాస్త వైరల్ కాగా.. అది కాస్త జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల వరకూ చేరింది.

తన సంకల్పాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న శ్రీనివాస్

పోలీస్ స్టేషన్ లో గుడాల శ్రీనివాస్ చేసిన డ్యాన్స్ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. అధికార పార్టీ బలంలో శ్రీనివాస్ ఇస్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.

దీంతో శ్రీనివాస్ తాను చేసిన పనికి వివరణ ఇస్తూ మరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీస్ అధికారులు ఉల్లాసంగా ఉండేందుకు యోగా, వ్యాయామం, డ్యాన్సులు చేయాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. అందరి ఆరోగ్యం బాగుండాలని వ్యాయామం, యోగా చేస్తూ డ్యాన్స్ చేయాలని చెప్తున్నానని, అందులో భాగంగానే మహదేవపూర్ పోలీస్ సిబ్బందితో వీడియో తీయించి పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

పోలీస్ అధికారులతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీసర్లు ఒత్తిడికి గురవుతున్నారని, వారంతా యోగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ చూసి నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశానని, తన సంకల్పాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ శ్రీనివాస్ సెల్ఫీ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

పోలీస్ సిబ్బందిపై బదిలీ వేటు వేసిన ఎస్పీ

ప్రజాసమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాల్సిన పోలీస్ స్టేషన్ లో ఓ ప్రజా ప్రతినిధి భర్త ఇష్టమొచ్చినట్టు స్టెప్పులు వేయడం, దానిని స్టేషన్ లో ఉన్న సిబ్బంది వీడియో తీస్తూ ఎంజాయ్ చేయడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరిగింది. పోలీసు స్టేషన్ ను డ్యాన్స్ క్లబ్ గా మార్చారంటూ విమర్శలు వెల్లువెత్తగా.. అధికార పార్టీని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు.

వెంటనే శ్రీనివాస్ తో పాటు ఆయనకు వత్తాసు పలుకుతున్న పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మహదేవపూర్ ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ఇదే విషయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే దృష్టికి వెళ్లింది. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన వెంటనే ఎంక్వైరీ చేయించారు.

అనంతరం సోమవారం సాయంత్రం మహదేవపూర్ పోలీస్ స్టేషన్ అధికారులపై వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ పని చేస్తున్న ఎస్సై ప్రసాద్ వెంటనే వీఆర్‌కు బదిలీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ కిరణ్ ఖరే సోమవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజాప్రతినిధి భర్త కారణంగా ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు పడగా.. జడ్పీటీసీ భర్త తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point

సంబంధిత కథనం