Warangal Mlcs: కాంగ్రెస్ గూటికి వరంగల్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు..బండా ప్రకాష్, సారయ్యల చేరికకు లైన్‌క్లియర్-warangal brs mlcs banda prakash sarayya to join congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Mlcs: కాంగ్రెస్ గూటికి వరంగల్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు..బండా ప్రకాష్, సారయ్యల చేరికకు లైన్‌క్లియర్

Warangal Mlcs: కాంగ్రెస్ గూటికి వరంగల్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు..బండా ప్రకాష్, సారయ్యల చేరికకు లైన్‌క్లియర్

HT Telugu Desk HT Telugu
Jul 02, 2024 09:14 AM IST

Warangal Mlcs: ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారం జరుగుతుండగా, అందులో ఓరుగల్లు నేతల పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరికకు లైన్ క్లియర్...
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరికకు లైన్ క్లియర్...

Warangal Mlcs: వరంగల్ కు చెందిన ముగ్గురు నేతలు పార్టీ మారుతున్నారనే చర్చ నడుస్తుండగానే సోమవారం మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారగా, అదే వరుసలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఓరుగల్లు బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది.

సొంత గూటికి బండ ప్రకాష్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదివరకు కాంగ్రెస్ లో కొనసాగిన కొందరు నేతలు తెలంగాణ ఏర్పడిన తరువాత వివిధ కారణాలతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇదిలాఉంటే అలా పార్టీ మారి గులాబీ కండువా కప్పుకున్న నేతల్లో చాలామంది యూ టర్న్ తీసుకుంటున్నారు. .

బీఆర్ఎస్ ను వీడి సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా సీఎంను కలిసిన బండ ప్రకాశ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా పని చేశారు. ఆ తరువాత పరిస్థితుల నేపథ్యంలో 2017లో బీఆర్ఎస్ లో చేరి, 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా 2021లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి.

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల పార్టీ నుంచి బయటకు వెళ్లడం, బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం అవసరమని భావించిన గులాబీ అధిష్టానం బండా ప్రకాష్ ను రంగంలోకి దించింది. 2021లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, మండలి డిప్యూటీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, ఆ పార్టీ నేతలకు సరైన ప్రాధాన్యం లేకపోవడంతో మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బండా ప్రకాష్ సీఎం రేవంత్ రెడ్డిని కలవగా, తొందర్లోనే ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే చర్చ నడుస్తోంది.

తొందర్లోనే సారయ్య కూడా..

ఇప్పటికే బండా ప్రకాష్ కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టేనని తెలుస్తుండగా, ఆయన తరువాత వరుసలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బస్వరాజు సారయ్య వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన ఆయన 2016లో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 2020లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలంగా బస్వరాజు సారయ్య పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఆయన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలతో ఓ సమావేశంలో పాల్గొనగా, అప్పుడే పార్టీ మారబోతున్నారనే చర్చ జరిగింది.

కానీ అదంతా ఏమీ లేదని కొట్టి పారేసిన ఆయన తాజాగా జూన్ 29న సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో ఆయన కూడా సొంతగూటి బాటపట్టారనే ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయ్యింది. ఇప్పటికే బండా ప్రకాష్ పార్టీ మారి కాంగ్రెస్ లో చేరుతున్నారనే సంకేతాలు అందగా, తొందర్లోనే సారయ్య కూడా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు.

గందరగోళంలో బీఆర్ఎస్…

ఇప్పటికే ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బాట పట్టగా, ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీని వీడుతుండటం పార్టీని కుదిపేస్తోంది. ఇదివరకు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కడియం శ్రీహరి ఎంపీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ లో చేరగా, ఇప్పుడు మరో ఇద్దరు కీలక నేతలు కూడా పార్టీ మారుతుండటంతో గులాబీ నేతల్లో గందరగోళం మొదలైంది. ఇదిలాఉంటే ఈ ఇద్దరి తరువాత మరో ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ లో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుండగా, ఇంకొద్దిరోజులు పోతే పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయోననే చర్చ నడుస్తోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner