Huzurabad Politics: హుజురాబాద్ లో రాజకీయ రగడ, పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్‌..-political ragada in huzurabad padi kaushik reddy vs ponnam prabhakar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Huzurabad Politics: హుజురాబాద్ లో రాజకీయ రగడ, పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్‌..

Huzurabad Politics: హుజురాబాద్ లో రాజకీయ రగడ, పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్‌..

HT Telugu Desk HT Telugu
Published Jun 26, 2024 06:33 AM IST

Huzurabad Politics: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ రగడ నెలకొంది. కాంగ్రెస్ బిఆర్ఎస్ మద్య సవాళ్ళు ప్రతి సవాళ్ళతో రాజకీయ దుమారం రేపుతోంది.

హుజురాబాద్‌లో రాజకీయ రగడ
హుజురాబాద్‌లో రాజకీయ రగడ

Huzurabad Politics: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ రగడ నెలకొంది. కాంగ్రెస్ బిఆర్ఎస్ మద్య సవాళ్ళు ప్రతి సవాళ్ళతో రాజకీయ దుమారం రేపుతోంది.

నేతల సవాళ్ళతో కార్యకర్తలపై పోలీసుల లాఠీలు నాట్యమడాల్సిన దుస్థితి ఏర్పడింది. లాఠి చార్జి తో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.

హుజురాబాద్ లో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ అవినీతి ఆరోపణలు చేశారు.

రామగుండం ఎన్టీపిసి నుంచి ఫ్లై యాష్ బూడిదను నేషనల్ హైవే నిర్మాణం కోసం ఖమ్మం కు సప్లై చేస్తుండగా బూడిద సప్లై లో మంత్రి పొన్నం చేతివాటం ప్రదర్శించి భారీగా ముడుపులు అందుకున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తాను చేసే ఆరోపణ నిజమని స్పష్టం చేసేందుకు చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వేదికగా ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.

దానికి ప్రతిగా మంత్రి పొన్నం అనుచరుడు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ప్రణబ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అవినీతి అక్రమ దందాలను నిరూపించేందుకు సిద్ధమని అందుకు కౌశిక్ రెడ్డి హనుమాన్ టెంపుల్ వద్దకు వచ్చి ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. సవాళ్లను స్వీకరించి ఇరుపార్టీల నేతలు మంగళవారం హనుమాన్ టెంపుల్ వేదికగా ప్రమాణానికి సిద్ధం అయ్యారు.‌

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు 20 లక్షలు తీసుకొని ఒకరికి కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తారని నిరూపించేందుకు సిద్ధమని సవాల్ విసరడంతో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు పార్టీల నేతలు చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు చేరుకోవడానికి సిద్ధంకాగ పోలీసులు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని భారీగా మోహరించి ఇరుపార్టీల నేతలు చెల్పూర్ కు రాకుండా కట్టడి చేశారు.

వీణవంకలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని స్వగృహంలో హౌస్ అరెస్టు చేశారు. అటు కాంగ్రెస్ ఇంచార్జి ప్రణబ్ ను హుజురాబాద్ మండలం సింగాపూర్ లో ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బయటికి వెళ్లకుండా కట్టడి చేశారు.

లాఠీ చార్జితో చెదరగొట్టిన పోలీసులు..

వీణవంకలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని, సింగపూర్ లో ప్రణబ్ ను బయటికి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేసినప్పటికీ వారి అనుచరులు పార్టీల కార్యకర్తలు కొందరు చెల్పూర్ కు చేరుకున్నారు. ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పర వ్యతిరేక నినాదాలతో హంగామ సృష్టించారు.

చెల్పూర్ నాయకుడు ఏకంగా హనుమాన్ టెంపుల్ లో తడిబట్టలతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనకు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని 20 లక్షలు డిమాండ్ చేశాడని ప్రమాణం చేశారు. అటు కౌశిక్ రెడ్డి అనుచరులు పొన్నం ప్రభాకర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ప్రమాణం చేసేందుకు టెంపుల్ వద్దకు దూసుకురాక పోలీసులు అడ్డుకున్నారు.

ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బిఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలతో టెంపుల్ వద్దకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించక పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

ఇంట్లో తడి బట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

పోలీసులు భారీగా మోహరించి చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు ఎవరు రాకుండా అడ్డుకోవడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వగ్రామం వీణవంక లోని తన ఇంట్లో తడిబట్టలతో ప్రమాణం చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి శాలువా కప్పుకుని, కొండగట్టు ఆంజనేయస్వామి చిత్రపటాన్ని చేతబూని తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ప్రమాణం చేశారు.

శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు పోలీసుల విజ్ఞప్తి మేరకు ఇంట్లోనే తడబట్టలతో ప్రమాణం చేసశానని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని పొన్నంకు చిత్తశుద్ధి ఉంటే బుధవారం ఉదయం 11 గంటలకు అపోలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని పొన్నంకు సవాల్. పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేసినట్లయితే బహిరంగ క్షమాపణ చెబుతానన్న కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

పొన్నంపై ఆరోపణలు నిరూపించకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్న ప్రణబ్

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేయడానికి సిగ్గు ఉండాలన్నారు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ప్రణబ్. సామాన్యమైన వ్యక్తులు ఒక ఎమ్మెల్యే పైన నిరాధార ఆరోపణలు చేయరని తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అవినీతి అక్రమ దందాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. మరీ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏవని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం అబద్ధపు ప్రమాణాలు చేసే నీచ స్థితికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిగజారాడని విమర్శించారు.

ఎమ్మెల్యే ఎన్నికల సమయం లో భార్య పిల్లల తో ప్రమాణం చేపించి గెలిచాడని ఆరోపించారు. అబద్ధపు ప్రమాణం చేసి కౌశిక్ రెడ్డి చరిత్ర సృష్టించాడని విమర్శించారు. ఇకనైనా మంత్రి పొన్నంపై ఆరోపణలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మానుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో నిరాధారమైన ఆరోపణలపై న్యాయస్థానంను ఆశ్రయిస్తామని తెలిపారు.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హెచ్‌టి తెలుగు)

Whats_app_banner

సంబంధిత కథనం