Hydra : హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. కారణం వేరే ఉందన్న ఏవీ రంగనాథ్!-woman commits suicide fearing hydra will demolish her house ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra : హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. కారణం వేరే ఉందన్న ఏవీ రంగనాథ్!

Hydra : హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. కారణం వేరే ఉందన్న ఏవీ రంగనాథ్!

Basani Shiva Kumar HT Telugu
Sep 28, 2024 07:29 AM IST

Hydra : హైడ్రా.. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల స్పీడ్ పెంచిన హైడ్రా.. కూల్చివేతల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదని చెప్పారు.

మృతురాలు బుచ్చమ్మ (పాతచిత్రం)
మృతురాలు బుచ్చమ్మ (పాతచిత్రం)

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె బంధువులు చెబుతున్నారు. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉండగా.. శివయ్య దంపతులు వారికి వివాహాలు చేసి కట్నంగా తలో ఇల్లును రాసిచ్చారు.

అయితే.. ఇటీవల చెరువులు, జలాశయాల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో తమ బిడ్డలకు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తారనే మనస్తాపంతో తల్లి బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడినట్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే.. ఈ ఘటనకు, హైడ్రాకు సంబంధం లేదని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని చెప్పారు.

'మేము ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ ఆత్మహత్య గురించి కూకట్‌పల్లి పోలీసులతో మాట్లాడాను. శివయ్య దంపతుల కూతుర్లుకు రాసిచ్చిన ఇళ్లు.. కూకట్‌పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నాయి. కానీ.. ఎఫ్‌టీఎల్‌ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కుమార్తెలు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది' అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు.

'ఈ ఘటనతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా గురించి మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ భయాలు పుట్టించవద్దని కోరుతున్నాను. తెలంగాణలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారు. మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా ప్రమేయం లేదు. మూసి నదిలో శనివారం భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి' అని ఏవీ రంగనాథ్ వ్యాఖ్యానించారు.

'కొన్ని సోషల్‌ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో పని చేస్తున్నాయి. హైడ్రాపై ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నా. హైడ్రా కూల్చివేతల గురించి భయాలు వద్దు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడొద్దని.. దీనికి సంబంధించి ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' రంగనాథ్‌ స్పష్టం చేశారు.

Whats_app_banner