తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Cyber Crime : ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఆశచూపి రూ.66 లక్షలు స్వాహా

Hyderabad Cyber Crime : ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఆశచూపి రూ.66 లక్షలు స్వాహా

HT Telugu Desk HT Telugu

02 March 2024, 18:26 IST

google News
    • Hyderabad Cyber Crime : ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడిని మోసం చేసి రూ.66 లక్షలు కొట్టేశారు సైబర్ నేరాగాళ్లు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ మరో యువకుడిని మోసం చేశారు.
ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఆశచూపి రూ.66 లక్షలు స్వాహా
ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఆశచూపి రూ.66 లక్షలు స్వాహా (pixabay)

ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఆశచూపి రూ.66 లక్షలు స్వాహా

Hyderabad Cyber Crime : అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడులు పెట్టిస్తూ, అందిన కాడికి దండుకుంటున్న రెండు సైబర్ ముఠాలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ (Hyderabad Cyber Crime )పోలీసులు చెక్ పెట్టారు. రెండు వేర్వేరు సైబర్ కేసులకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ కవిత శుక్రవారం తెలిపారు. ఏసీపీ శివ మారుతితో కలిసి బషీర్ బాగ్ లోని ఓల్డ్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో... కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

విదేశీ ట్రేడింగ్ పేరుతో వృద్ధుడిని మోసం

హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడు కొన్నాళ్లుగా ఆన్లైన్ ట్రేడింగ్(Online Trading) చేస్తున్నాడు. అతడికి కొన్నాళ్ల క్రితం టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇంటర్నేషనల్ కంపెనీలో ట్రేడింగ్ పేరుతో సందేశం వచ్చింది. ఆయన ఆ మెసేజ్ కు ఆసక్తి చూపడంతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిన అవతల వ్యక్తులు సౌత్ ఆఫ్రికాకు చెందిన ఉకుచుమ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ త్వరలో ఆన్లైన్ స్టాక్స్ ప్రారంభిస్తుందనీ....అవి ఖరీదు చేయాలంటే ప్రత్యేక డీ మ్యాట్ (Demat Account) అకౌంట్ తెరవాల్సి ఉంటుందని ఆ వృద్ధుడుని నమ్మించారు. ఇదంతా నమ్మిన ఆ వృద్ధుడు వాళ్లు చెప్పినట్టు ప్రత్యేక డీ మ్యాట్ ఖాతాను తెరిచాడు. మొదట్లో పలు డాలర్ల రూపంలో వృద్ధుడు చేత ట్రేడింగ్ చేయింటి డాష్ బోర్డులో అధిక లాభాలు వస్తున్నట్లు చూపించారు. కొన్ని రోజులకు ఎక్కువ డబ్బు పెడితే లాభాలు కూడా అంతే అధికంగా వస్తాయని నమ్మించారు. దీంతో పలు దఫాలుగా మొత్తం 80,300 డాలర్లు ( రూ.66 లక్షలు ) పెట్టుబడి పెట్టారు.

ఈ మొత్తాన్ని బాధితుడు ఇండియన్ కరెన్సీ రూపంలో వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. నగదు తీసుకోవాలని భావించగా డీ మ్యాట్ ఖాతాలో నెగిటివ్ బ్యాలెన్స్ ఉందంటూ మరికొంత పెట్టుబడి పెట్టమన్నారు.దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఇన్స్పెక్టర్ నాగేష్ దర్యాప్తు చేశారు. ఈ నేరాలు చేయడానికి అవసరమైన బ్యాంకు ఖాతాలను గుజరాత్ కు చెందిన అరవింద్ కుమార్ శ్యామ్ సమకూర్చినట్టు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసి విచారించిన అనంతరం బ్యాంక్ ఖాతాలో ఆధారంగా రూ. 4 కోట్ల స్కాం జరిగినట్లు వీటిపై రాష్ట్రంలో రెండు కేసులతో సహా దేశవ్యాప్తంగా ఐదు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆయా ఖాతాల్లో ఉన్న రూ.66 లక్షలు,హైదరాబాద్ వాసికి చెందిన రూ.35 లక్షలకు సైబరాబాద్ పోలీసులు సీజ్ చేశారు.

రూ.500 ఇచ్చి రూ.2.38 లక్షలు స్వాహా

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్న యువకుడు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే అతడికి టెలిగ్రామ్ యాప్(Telegram App) ద్వారా వర్క్ హోం పేరుతో ఒక ప్రకటన వచ్చింది. సదరు యువకుడు ఆ సందేశానికి స్పందించడంతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు ఫ్లైట్ టికెట్ బుకింగ్ టాస్కులు చేయాలని అందుకోసం ఒక ఖాతా ఓపెన్ తెరవాలని కోరారు. దీంతో అదంతా నిజమేనని నమ్మిన యువకుడి తో తొలుత ఒక టికెట్ బుక్ చేయించి ఒక రూ.500 లు బోనస్ గా ఇచ్చారు. ఆపై ఇన్వెస్ట్మెంట్స్ పేరు చెప్పి రూ. రెండున్నర లక్షలు పెట్టుబడి పెట్టించి వర్చువల్ డాష్ బోర్డులో ఫేక్ లాభాలు చూపారు. ఒకవేళ డబ్బు విత్ డ్రా చేస్తే నెగిటివ్ బ్యాలెన్స్ లోకి వెళుతుందని మాయ మాటలు చెప్ప సాగారు.

దీంతో మోసపోయినని గ్రహించి బాధితుడు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ నాగేష్ బృందం....బోగస్ కంపెనీల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముంబయికి చెందిన మహమ్మద్ షోయబుల్లాఖాన్ ను అరెస్ట్ చేసింది. అనంతరం అతడి నుంచి రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ కేసులో సూత్రధారిగా ఉన్న గుజరాత్ కు చెందిన అబ్దుల్లా షారుక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఈ బ్యాంక్ ఖాతాల ఆధారంగా దేశవ్యాప్తంగా 42 నేరాలు చేసి రూ. నాలుగున్నర కోట్లు కాజేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. వీటిలో 6 కేసులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవే ఉన్నాయి అని పోలీసులు వెల్లడించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం