Fake Messages : ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త.. స్పందించారో దోచేస్తారు.!
Work From Home Fake Messages: వర్క్ ఫ్రమ్ హోం జాబ్ అంటూ వచ్చే సందేశాలకు స్పందివద్దని పోలీసులు సూచిస్తున్నారు. స్పందిస్తే…. మన బ్యాంకు ఖాతాల్లో ఉండే డబ్బులను దోచేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Work From Home Fake Messages: బహిర్గత మార్కెట్ లో మోసాలను కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తే తప్పించుకోవచ్చు.. కానీ అనూహ్యంగా ఆన్ లైన్ లో చోటుచేసుకునే మోసాలను తప్పించుకోవడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఆన్ లైన్ లో కనిపించే ఆకర్షణీయ ప్రకటనల్లో ఏది వాస్తవమే, ఏది అవాస్తవమో అంతు చిక్కని అయోమయ పరిస్థితి నెలకొంటోంది. ప్రధానంగా ఈ ఉచ్చులో ఉపాధి కోసం వెతుకులాడే నిరుద్యోగ యువతీ, యువకులు పడిపోతున్నారు.
ఇటీవల "వర్క్ ఫ్రం హోమ్" పేరుతో ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నకిలీ వెబ్‌సైట్ లింక్ పంపి సుమారు రూ. లక్ష వరకు కాజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని నిజాంపేటకు చెందిన నవ్యశ్రీ అనే యువతి ఇటీవల బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఈ క్రమంలోనే నవ్యశ్రీకి ఈ నెల 2వ తేదీన ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ‘వర్క్ ఫ్రమ్ హోం’ జాబ్ పేరుతో ఓ లింక్‌ను పంపించాడు. లింక్‌ను ఓపెన్ చేసి కొన్ని టాస్క్‌లు చేస్తే జీతం వస్తుందని నమ్మించారు. దీంతో నిజమే అనుకున్న నవ్యశ్రీ లింక్ ఓపెన్ చేసి వాళ్లు ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేసింది. అయితే ఇందుకోసం ముందుగా కొంత డబ్బు చెల్లించాలని, చెల్లించిన దానికి ఎక్కువ మొత్తం తిరిగి చెల్లిస్తామని నమ్మబలికారు. దీంతో నిజమేనని నమ్మిన ఆ యువతి వెనకా ముందు ఆలోచించకుండా తన అకౌంట్ నుంచి ఏడు దఫాలుగా మొత్తం రూ.91,100 పంపించింది. ఆ డబ్బులు పంపిన తర్వాత అవతలి నుంచి స్పందించే తీరు ఒక్కసారిగా మారిపోయింది. రెట్టింపు మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పిన అవతలి వ్యక్తులు ఎంతకీ డబ్బులు తిరిగి చెల్లించకపోడంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే తాను పంపిన డబ్బులు తిరిగి పంపాలని కోరింది. దీంతో అవతలి వ్యక్తి రూ.83 వేలు పన్ను చెల్లిస్తే సొమ్ము తిరిగి ఖాతాలోకి వస్తాయని సమాధానం ఇచ్చాడు. దీంతో తాను మోసపోయానని భావించిన బాధితురాలు అదే రోజు సైబర్ క్రైం 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.
అనంతరం స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు తాజాగా సర్వసాధారణంగా మారిపోయాయి. ఉద్యోగం కోసం వెతుకులాటలో చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్మును కూడా కోల్పోతున్న దుస్థితి నెలకొంటోంది. అందుకే తస్మాత్ జాగ్రత్త.! వాట్స్ ఆప్, ఫెస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాద్యమాలను విపరీతంగా వాడేస్తున్న యువతీ, యువకులు వాటిల్లో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలన్నీ నిజమని నమ్మి మోసపోకండి.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.
సంబంధిత కథనం