Punjagutta Former CI Arrest : బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసు, ఏపీలో పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్!
05 February 2024, 21:30 IST
- Punjagutta Former CI Arrest : పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని తప్పించడంలో అప్పటి సీఐ దుర్గారవు కీలకంగా వ్యవహరించట్లు దర్యాప్తులో తేలింది. దీంతో సీపీ.. సీఐను సస్పెండ్ చేశారు.
పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్
Punjagutta Former CI Arrest : హైదరాబాద్ లోని పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో ప్రజాభవన్ ముందు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిని తప్పించడంలో పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలడంతో ...... ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి సీఐ దుర్గారావు పరారీలో ఉన్నాడు. అతడిని పోలీసులు వెతుకుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం గుంతకల్ రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డాడు.
పోలీసుల అదుపులో
మాజీ సీఐ దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో పోలీసులు దుర్గారావును విచారిస్తున్నారు. కాగా దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అయితే డిసెంబర్ 23 తెల్లవారుజామున హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముందు ఉన్న బారికెడ్లను బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోయల్ కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.... పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారకుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహల్ ను తప్పించి అతడి డ్రైవర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. కాగా ప్రధాన నిందితుడు సోహెల్ దుబాయ్ పారిపోగా అతనిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాజీ సీఐ దుర్గారావు డ్యూటీలో ఉన్నట్టు అతనే ప్రధాన నిందితుని తప్పించడంలో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో మాజీ సీఐ దుర్గారావుపై 17 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆయనతోపాటు సోహెల్ విదేశాలకు వెళ్లేందుకు సహకరించారని తేలడంతో బోధన్ సీఐను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం బదిలీ
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని హోంగార్డుల నుంచి ఇన్స్పెక్టర్ వరకు అందర్నీ బదిలీ చేశారు. ఇందులో కొంతమందిని ఏఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసు విషయంలో స్టేషన్ సిబ్బంది చేసిన నిర్వాకం వల్ల అతను దేశం విడిచి వెళ్లడంతో పాటు ఇటీవల ఓ హోటల్ గొడవ విషయంలో కూడా స్టేషన్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి మృతిచెందడంతో పెద్ద ఎత్తున అక్కడ సిబ్బందిపై విమర్శలు వచ్చాయి. దీంతో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రజా భవన్ పంజాగుట్ట పరిధిలో ఉండడంతో అక్కడికి వచ్చే బాధితుల వివరాలు కూడా మాజీ ప్రభుత్వ నేతలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా దేశ చరిత్రలోనే ఒకే ఆర్డర్ కాపీ తో స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేయడం ఇదే మొదటిసారి.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా