Praja Bhavan Accident : మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో బీభత్సం, ప్రజాభవన్ బారికేడ్ల ఢీకొట్టి హల్చల్!
Praja Bhavan Accident : హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఇటీవల ఓ కారు బీభత్సం సృష్టించింది. అయితే ఆ కారులో ఉన్నది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిగా పోలీసులు గుర్తించింది. అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Praja Bhavan Accident : హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారుతో హల్చల్ చేశాడు. డిసెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీఎండబ్ల్యూ కారును నడుపుతున్న షకీల్ కుమారుడు.... అతివేగంతో వచ్చి ప్రజా భవాన్ ఎదుట ఉన్న బారికేడ్లను ఢీ కొట్టాడు. ఆ సమయంలో కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని పోలీసులు వెల్లడించారు.
మరో యువకుడిపై కేసు
కారు నడిపింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అయినప్పటికీ......అతన్ని తప్పించి కారులో ఉన్న మరో యువకుడిపై కేసు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. షకీల్ కుమారుడు సోహెల్ కు బదులుగా కారులో ఉన్న మరో యువకుడు అబ్దుల్ అసిఫ్ కారును డ్రైవ్ చేసినట్లుగా కేసు నమోదు అయ్యింది. అయితే మాజీ ఎమ్మెల్యే కుమారుడు గతంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్ లు చెయ్యడంతో అతనే డ్రైవింగ్ చేసి ప్రజభావన్ బారికేడ్లను ఢీ కొట్టి ఉంటాడని ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పంజాగుట్ట పోలీసులను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
పరారీలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు
సీపీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు. కారు డ్రైవింగ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడేనని పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం జరిగిన వెంటనే షకీల్ కుమారుడు సోహెల్ పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న అబ్దుల్ అసిఫ్ అనే వ్యక్తిని కోర్టులో హాజరు పరిచామన్నారు. ప్రధాన నిందితుడు సోహెల్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా