HMDA Ex Director Case : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు, తెరపైకి ఐఏఎస్ పేరు!
10 February 2024, 17:21 IST
- HMDA Ex Director Case : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో కీలక వ్యక్తి పేరు బయపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది. అరవింద్ కుమార్ ఒత్తిడితోనే బిల్డింగ్ లకు, లే అవుట్లకు అనుమతులిచ్చినట్లు బాలకృష్ణ ఒప్పుకున్నారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ కేసులో ఐఏఎస్ పేరు
HMDA Ex Director Case : హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ రిపోర్టులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును చేర్చింది. అరవింద్ కుమార్ ఒత్తిడితోనే తాను బిల్డింగ్ లకు, లే ఔట్లకు అనుమతులు ఇచ్చానని శివబాలకృష్ణ ఒప్పుకున్నారు. అరవింద్ కుమార్ కు తాను కోట్ల రూపాయలు ముట్ట చెప్పినట్టు అధికారుల వద్ద శివ బాలకృష్ణ ఒప్పుకున్నారు. అయితే అరవింద్ కుమార్ ను ను విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వం అనుమతి కోరింది. శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చిన ఉత్తర్వుల తేదీ అరవింద్ కుమార్ ఆస్తుల కొనుగోలు తేదీలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చి విచారణ జరపనుంది. అలాగే శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ను లోతుగా విచారిస్తే బాలకృష్ణకు సంబంధించిన మరి కొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే చంచల్ గుడ్ జైల్లో ఉన్న శివబాలకృష్ణకు జైల్ అధికారులు భద్రతను పెంచారు. శివ బాలకృష్ణ ఉంటున్న రూంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
బయటకు వస్తున్న శివ బాలకృష్ణ బాధితులు
మరోపక్క శివబాలకృష్ణ బాధితులు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. శివ బాలకృష్ణ వల్ల తాము భూమిని కోల్పోయామని తమకు శివబాలకృష్ణ తీవ్ర అన్యాయం చేశారని పలువురు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలాపూర్ పహాడ్ షరీఫ్ దర్గా దగ్గర సర్వే నంబర్ 145 /P లో ఉన్న భూమిని 1950లో ఆనాటి ప్రభుత్వం కౌలు రైతులకు కేటాయించింది. ఆ భూమికి 1987లో వారసత్వ లీగల్ పాత్రలు కూడా జారీ అయ్యాయి. ఆ మొత్తం భూమిని 13 కుటుంబాలకు సమానంగా పంచగా..... 2006లో ఆ భూమి నాదేనంటూ ఓ వ్యక్తి జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అదే అదనుగా భావించి వీఎన్ఆర్ ఏరోసిటీ డెవలప్మెంట్ అధినేత వేమిరెడ్డి నరసింహారెడ్డి ఆ భూమి నాదేనంటూ కబ్జా చేశారు. దీంతో అసలైన భూయజమానులు న్యాయం కోసం హై కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే 90 ఎకరాల్లో లేఅవుట్ కోసం నరసింహరెడ్డి 2019లో దరఖాస్తు చేసుకున్నారు. 2020లో డ్రాప్ లేఅవుట్ కు అనుమతి తెచ్చుకున్నారు. అయితే అక్రమంగా లేఅవుట్ నిర్మించుకున్న నర్సింహారెడ్డికి శివ బాలకృష్ణ లంచం తీసుకొని అనుమతులు ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఐఏఎస్ రజత్ కుమార్ కు 52 ఎకరాలు
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం హెమాజిపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 83, 84, 85లో 52 ఎకరాల భూమి ఐఏఎస్ రజత్ కుమార్, అతడి తండ్రి B.K సిన్హా పేరుపై ఉన్నట్లు ధరణిలో గుర్తించారు. హెమజిపూర్ గ్రామ పరిధిలో మొత్తం మూడు సర్వే నంబర్లలో వివిధ సబ్ డివిజన్ల నంబర్లపై మొత్తం 52 ఎకరాల భూమి రజత్ కుమార్ అలాగే తన తండ్రి B.K సిన్హా పేరిట ఉన్నట్లు ధరణిలో రికార్డులు ఉన్నాయి. కాగా డీఓపీటీ అనుమతులు లేకుండానే ఈ భూమి కొనుగోలు జరిగినట్లు సమాచారం. అయితే గత ప్రభుత్వ హయాంలో రజత్ కుమార్ కీలక పదవుల్లో పనిచేశారు. ఆయన కూతురు వివాహానికి మెగా ఇంజినీరింగ్ అండ్ కన్స్ ట్రాక్షన్ కంపెనీ కోట్ల రూపాయల ఖర్చు పెట్టుకుందని ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా