HMDA Shiva Balakrishna : రూ. 250 కోట్లకు పైనే శివబాలకృష్ణ ఆస్తులు, బినామీల పేర్లపై 214 ఎకరాల భూమి!
07 February 2024, 22:35 IST
- HMDA Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు నాంపల్లికోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. 8 రోజుల ఏసీబీ కస్టడీలో కీలక విషయాలు వెలుగుచూశాయి.
రూ. 250 కోట్లకు పైనే శివరామకృష్ణ ఆస్తులు
HMDA Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 8 రోజుల పాటు కస్టడీలో ఉన్న శివబాలకృష్ణ నుంచి ఏసీబీ కీలక వివరాలు రాబట్టింది. నేటితో ఏసీబీ కస్టడీ ముగిసింది. అయితే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శిగా శివబాలకృష్ణ పనిచేసినప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు మంజూరు చేసిన అనుమతులపై ఏసీబీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 8 రోజుల కస్టడీలో శివబాలకృష్ణపై ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ...కీలక సమాచారం రాబట్టింది. ఆయనకు ముగ్గురు బినామీలు ఉన్నట్లు గుర్తించారు.
రూ.250 కోట్ల ఆస్తులు
శివబాలకృష్ణ తన పేరిట, బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, ఏడు ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీటితో పాటు కుటుంబ సభ్యుల పేరుతో 29 ప్లాట్లు ఉన్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు బంధువుల పేరుతో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తెలంగాణతో పాటు ఏపీలోని విశాఖపట్నంలో శివబాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బయటపడిన ఆస్తులు రూ.250 కోట్ల విలువ చేస్తాయని అధికారులు తెలిపారు. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది ఏసీబీ. నవీన్ విచారణ కూడా ముగియడంతో కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు అధికారులు. నవీన్ కస్టడీకి ఇవ్వాలని మళ్లీ కోర్టును కోరాలని ఏసీబీ భావిస్తోంది. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కూడా ఏసీబీ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు మరో 14 రోజులు రిమాండ్‌ను పొడగించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు.
మరో ముగ్గురి అరెస్టుకు రంగం సిద్ధం
అయితే శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ సుమారు రూ. వెయ్యి కోట్లకు పైగా ఉండొచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తులో కీలక సమాచారం వెలుగుచూస్తుడడంతో ఆయన రిమాండ్ ను పొడిగించాలని కోర్టును కోరింది ఏసీబీ. దీంతో శివబాలకృష్ణ రిమాండ్‌ను కోర్టు 14 రోజుల పాటు పొడగించింది. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు సంబంధించి హెచ్‌ఎండీఏలో పలువురు అధికారులు పాత్రపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. పలు కీలక ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శివబాలకృష్ణ బ్యాంక్ లాకర్స్‌లో ఉన్న బంగారం, ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలను సీజ్ చేశామన్నారు. ఈ కేసులో శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను ఏసీబీ అరెస్టు చేసింది. శివ బాలకృష్ణకు సోదరుడు నవీన్ కుమార్ బినామీగా ఉన్నాడు.
అనుమతుల్లో భారీగా అక్రమాలు
శివబాలకృష్ణ గతంలో హెచ్‌ఏండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే.. మరోవైపు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్‌లో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గానూ కొనసాగారు. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నుంచి దస్త్రాలను ఆయనే అనుమతులు జారీ చేసేవారు. ఎంఏయూడీలో డైరెక్టర్ హోదాలో ప్రభుత్వ జీవోలు జారీ చేసేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి.. తదితర ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధి పలు జోన్లలో నిబంధనల్ని ఆసరాగా చేసుకొని వందల అనుమతులు మంజూరు చేసేందుకు భారీగా వసూలు చేసినట్లు గుర్తించారు. ఒక్కో అంతస్తుకు అనుమతుల కోసం భారీగా లంచాలు వసూలు చేశారు. లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు అనుమతి ఇవ్వడానికి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. నెలకు సగటున 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తులు పోగేశారనే ఆరోపణలు ఉన్నాయి.