HMDA Ex Director: తవ్వేకొద్దీ ఆస్తులు, వందల కోట్లు పోగేసిన శివబాలకృష్ణ
25 January 2024, 12:17 IST
- HMDA Ex Director: అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల విలువైన ఆస్తులు పోగేసిన అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. హెచ్‌ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో కోట్ల ఆస్తులు
HMDA Ex Director: హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి భాగోతం తవ్వేకొద్దీ బయట పడుతోంది. సోదాల్లో వెలుగు చూస్తున్న ఆస్తుల్ని చూసి ఏసీబీ అధికారులు నోరెళ్ల పెడుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో వంద ఎకరాల భూముల్ని బాలకృష్ణ బినామీ పేర్లతో సంపాదించినట్లు పత్రాల ద్వారా గుర్తించారు.
హైదరాబాద్‌లో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లతో పాటు 2కిలోలకు పైగా బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. బుధవారం నుంచి శివబాలకృష్ణ ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో దాదాపు 20చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు రూ.85లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మరో 4 బ్యాంకు లాకర్లను నేడు తెరువనున్నారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో శివబాలకృష్ణను అధికారులు ప్రశ్నిస్తున్నారు. శివరామకృష్ణ బినామీలపై ఆరా తీస్తున్నారు. బినామీల పేరిట విలువైన ఆస్తులను పోగేసినట్టు చెబుతున్నారు.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణను బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
గతంలో హెచ్‌ఏండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే.. మరోవైపు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్‌లో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గానూ కొనసాగారు. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నుంచి దస్త్రాలను ఆయనే అనుమతులు జారీ చేసేవారు.
ఎంఏయూడీలో డైరెక్టర్ హోదాలో ప్రభుత్వ జీవోలు జారీ చేసేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి.. తదితర ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
హెచ్‌ఎండీఏ పరిధి పలు జోన్లలో నిబంధనల్ని ఆసరాగా చేసుకొని వందల అనుమతులు మంజూరు చేసేందుకు భారీగా వసూలు చేసినట్లు గుర్తించారు. ఒక్కో అంతస్తుకు అనుమతుల కోసం భారీగా లంచాలు వసూలు చేశారు. లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు అనుమతి ఇవ్వడానికి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. నెలకు సగటున 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తులు పోగేశారనే ఆరోపణలు ఉన్నాయి.