Dharani Portal Committee : ధరణి పోర్టల్ సమస్యలపై కమిటీ మరోసారి భేటీ, 7 అంశాలపై సమగ్రంగా చర్చ
Dharani Portal Committee : ధరణి పోర్టల్ సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ శనివారం మరోసారి భేటీ అయ్యింది. ప్రస్తుతం అందిస్తున్న సేవలు, సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్న విధానం, ఎదుర్కొంటున్న సమస్యలపై కమిటీ సభ్యులు చర్చలు జరిపారు.
Dharani Portal Committee : ధరణి పోర్టల్ పునర్నిర్మాణం, సమస్యలు పరిష్కారానికి సిఫార్సులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారిగా ఈనెల 24న జిల్లా కలెక్టర్లతో సమావేశం అవ్వగా......తాజాగా శనివారం సచివాలయంలో వ్యవసాయ, గిరిజన, సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్ర స్థాయి సిబ్బందితో ధరణి కమిటీ మరోసారి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలు, సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్న విధానం, ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఈ కమిటీ సభ్యులు చర్చలు జరిపారు. రైతులకు పెట్టుబడి సాయం (రైతు భరోసా) అందించే క్రమంలో ధరణి సాఫ్ట్ వేర్ ద్వారా నిర్వహణ, భూముల సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఆర్వోఎఫ్అర్ జారీ, పోర్టల్ వేదికగా దీనికోసం జారీ చేసే ఫాం " కె" " ఎల్ "ల నిర్వహణ, షెడ్యూల్ ప్రాంతాల్లో భూముల క్రయ విక్రయాల నిర్వహణ ఇబ్బందులు, అటవీ, రెవెన్యూ శాఖల భూముల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు, రెవెన్యూ దస్త్రాల్లో నమోదైన అటవీ భూములకు సంబంధించిన అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు.
ఏడు అంశాలపై చర్చ
రాష్ట్ర సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు ధరణి పోర్టల్ నిర్వహణ, భూ విచారణకు సంబంధించి తహశీల్దార్లు ఆర్డీవోల పాత్ర, సమస్యల పరిష్కారానికి పోర్టల్లోని ఎంపికలు, వాటి పని తీరుపై చర్చించారు. ధరణి సమస్యలపై ఫిర్యాదు రావడంతో గ్రామీణ, అటవీ రెవెన్యూ సరిహద్దు, సర్వే తదితర సమస్యలు తలెత్తిన జిల్లాలను దేవాదాయ శాఖ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి తగిన సమాచారంతో హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపారు. మొత్తం 7 అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన భూ భారతి సర్వే ప్రాజెక్టు అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి ధరణి పోర్టల్ సాఫ్ట్ వేర్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధులను రెవెన్యూ శాఖ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా