HMDA Ex Director Case : హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై వేటుకు రంగం సిద్ధం!-hyderabad news in telugu govt planning to suspend hmda former director balakrishna ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hmda Ex Director Case : హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై వేటుకు రంగం సిద్ధం!

HMDA Ex Director Case : హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై వేటుకు రంగం సిద్ధం!

HT Telugu Desk HT Telugu
Jan 29, 2024 04:37 PM IST

HMDA Ex Director Case : హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై వేటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు న్యాయ సలహాలు తీసుకున్నట్లు సమాచారం. శివబాలకృష్ణ అవినీతికి పాల్పడ్డినట్లు ఏసీబీ ఆరోపిస్తుంది. ఏసీబీ సోదాల్లో వందల కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులు పట్టుబడ్డాయి.

రెరా కార్యదర్శి బాలకృష్ణ
రెరా కార్యదర్శి బాలకృష్ణ

HMDA Ex Director Case : ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈనెల 24న హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (HMDA) మాజీ డైరెక్టర్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ( రెరా) సెక్రెటరీ శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారుల సోదాల్లో వందల కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పెద్ద సంఖ్యలో యాపిల్ ఫోన్లు ,ల్యాప్ ట్యాప్ లు, ఖరీదైన వాచీలు కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ పేర్కొంది. అయితే పలువురు బినామీల పేరిట ఆస్తులు సంపాదించినందున ఆ వివరాలను రాబట్టేందుకు కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తుంది. అవినీతికి సహకరించిన ఇతర అధికారుల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 45 పేజీలో రిమాండ్ రిపోర్టులో బాలకృష్ణకు సంబంధించిన ఆస్తులు, అక్రమంగా అర్జించడానికి అనుసరించిన విధాలను ఏసీబీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అతడిని సర్వీస్ నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు న్యాయ సలహాలు తీసుకున్నట్లుగా సమాచారం.

బెయిల్ పిటిషన్ దాఖలు

అయితే ఏసీబీ కోర్టులో రెరా కార్యదర్శి బాలకృష్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ రిమాండ్ రిపోర్టులో చెప్పినట్లు తనకు అన్ని ఆస్తులు లేవన్నారు. తాను ఏటా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని, బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరింత దర్యాప్తునకు బాలకృష్ణను 10 రోజులు రిమాండ్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మాజీ సీఎస్ భార్య పేరిట కోట్ల విలువ చేసే భూమి

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య డాక్టర్ గ్యాన్ముద్ర పేరిట రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 25 ఎకరాల భూమి ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక్క ఎకరా భూమి విలువ రూ.3 కోట్ల వరకు ఉన్న ఆ ప్రాంతంలో ఏకంగా 25 ఎకరాలు ఎలా కొన్నరంటూ అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ధరణి పోర్టల్ వచ్చాక కొనుగోలు జరిగిందా లేక అంతకుముందే చేశారా? ఎలా కొనుగోలు చేశారు? అన్నదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టాదారు గ్యాన్ముద్ర పై ఖాతా నెంబరు 5237 ద్వారా సర్వే నెం.249/ఆ/1 లో 8 ఎకరాలు, సర్వే నెం. 249/ఆ2 లో 10 ఎకరాలు, సర్వే నేం.260/ఆ/1/1 లో 7.19 ఎకరాల వంతున మొత్తం 25.19 ఎకరాలు ఉన్నట్లు ధరణి పోర్టల్ ద్వారా తేలింది. వాస్తవానికి భూరికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూఖాతాదారులు లేరు. మరి ఈ ఖాతా నెంబరు ఏ విధంగా కేటాయించారు అన్నది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఈ భూమి సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయలేదని తెలుస్తుంది. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు కనిపించడం లేదు.

ఇల్లు అమ్మి భూమి కొనుగోలు : సోమేష్ కుమార్

తాను ప్రభుత్వ నిబంధనలను అనుసరించే 2018 ప్రారంభంలోనే 25 ఎకరా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రశసన్ నగర్ లో కేటాయించిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి కొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల క్రిందట వ్యవసాయ భూమి కొనుగోలు చేశానని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించే ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నానని స్పష్టం చేశారు. భూమి కొనుగోలుకు అనుమతిస్తూ ప్రభుత్వం కూడా తనకు ఒక లేఖ ద్వారా అనుమతించిందన్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner