TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, మరో మూడు రోజులు వర్షాలు- హైదరాబాద్ లో కూల్ వెదర్
18 March 2024, 19:20 IST
- TS AP Rains : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం వర్షం పడింది. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు
TS AP Rains : హైదరాబాద్ (Hyderabad Rains)లో వాతావరణం చల్లబడింది. కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్టోగ్రతలతో ఇబ్బంది పడుతున్న భాగ్యనగర వాసులను వరుణుడు(Rains) కూల్ చేశాడు. చల్లటి గాలులు, తేలికపాటి జల్లులు హైదరాబాద్ వాసులకు ఉపశమనం కల్పించాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మరో మూడు, నాలుగు రోజులు ఇలాంటి చల్లటి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం నుంచి ఎండ దంచికొట్టినా సాయంత్రం వాతావరణం చల్లబడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం(Hyderabad Rains)పడింది. చింతల్, ఐడీపీఎల్, షాపూర్ నగర్, జీడిమెట్ల, సురారం, పటాన్ చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్ ల్లో తేలికపాటి వర్షం పడింది. గత కొన్ని రోజులుగా ఎండలతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కల్పించింది.
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం(TS Weather) మారింది. మరో మూడు రోజులు వర్షాలు(TS Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, నిజామాబాద్, సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో వెదర్ కూల్ అయ్యింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది.
ఏపీలో వర్షాలు
ఏపీలో వాతావరణం(AP Weather) చల్లబడింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో(Coastal Andhra Weather) బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఎల్లుండి(మార్చి 20) అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు(AP Rains) పడనున్నాయని తెలిపింది. అలాగే మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండవద్దని తెలిపింది. పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.