TS AP Weather : తెలంగాణకు చల్లటి కబురు - 4 రోజులపాటు వర్షాలు, తగ్గనున్న ఎండలు
TS Aandhrapradesh Weather Updates: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల దంచికొడుతున్నాయి. అయితే ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఐఎండీ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని బులెటిన్ విడుదల చేసింది.
Telangana AP Weather Updates: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ(IMD) చల్లని కబురు చెప్పింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ వర్ష సూచన ఇచ్చింది. తెలంగాణలో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు(Rains in Telangana) కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.... ఇవాళ(మార్చి 16) రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడకక్కడ మాత్రమే ఈ వర్షాలు ఉంటాయని వెల్లడించింది. మార్చి 17, 18,19, 20 తేదీల్లో కూడా రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
కోస్తాకు వర్ష సూచన….
మరోవైపు ఏపీకి వర్ష సూచన ఇచ్చింది భారత వాతావరణశాఖ(IMD). ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒకటి రెండు చోట్ల మాత్రమే ఈ వర్షాలు ఉంటాయని పేర్కొంది. ఇక దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో కూడా ఇవాళ, రేపు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని, వేడి, తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
గంగానది పరివాహన బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా వరకు ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు విదర్భ వరకు ఛత్తీస్ ఘడ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటక మరియు పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరిత ఆవర్తనం ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక, పొరుగు ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిమ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.
ఇక మార్చి 15వ తేదీన ఐఎండీ రిపోర్టు చూస్తే... సీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా నమోదైంది. కడపలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.... అనంతపురంలో 40.7, నంద్యాలలో 40.5, తిరుపతిలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఇక అమరావతి, విశాఖపట్నం, గన్నవరం, తుని, నెల్లూరు, నర్సాపూర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక తెలంగాణలో చూస్తే....ఆదిలాబాద్ లో 38.3 డిగ్రీలు, ఖమ్మంలో 38 డిగ్రీలు, రామగుండంలో 37.5, మెదక్ -37.6, రాజేంద్రనగర్ లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.