Revanth Reddy: మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఐటీఐ కోర్సులు, సిలబస్ అప్ గ్రేడ్ చేయండి- సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
22 September 2024, 7:00 IST
- CM Revanth Reddy : మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఐటీసీ కోర్సులను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కోర్సులకు సిలబస్ రూపకల్పనకు నిపుణులు, విద్యావేత్తలతో కమిటీ నియమించాలన్నారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఐటీసీ కోర్సులు, సిలబస్ అప్ గ్రేడ్ చేయండి- సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
CM Revanth Reddy : మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు ఓ కమిటీని నియమించి, నిపుణులు, విద్యావేత్తల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐటీఐ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాలని, శిక్షణ తీసుకుంటున్న వారికి సమగ్రమైన శిక్షణ అందేలా జాగ్రత్త పడాలని సూచించారు.
ఐటీఐ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీలు క్రమం తప్పకుండా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఐటీఐ, ఏటీసీ లేని శాసనసభ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా మార్చుతున్న నేపథ్యంలో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు. ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో ఏటీసీల్లో సిలబస్ మార్పునకు ఉన్నతస్థాయి కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలతో పాటు స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని చెప్పారు.