Nagarjuna Family At Court : కుటుంబంతో సహా కోర్టుకు వచ్చిన హీరో నాగార్జున, వాంగ్మూలం ఇదే
08 October 2024, 16:51 IST
- Nagarjuna Family At Court : మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ హీరో నాగార్జున స్వయంగా హాజరై కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి ఆయన కోర్టుకు వచ్చారు.
కుటుంబంతో సహా కోర్టుకు వచ్చి హీరో నాగార్జున, వాంగ్మూలం ఇదే
మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు...మంగళవారం హీరో నాగార్జున వాంగ్మూలం నమోదు చేసింది. తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం, తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున కోర్టుకు తెలిపారు. ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ... హీరో నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు హీరో నాగార్జున. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారనని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలని హీరో నాగార్జునను కోరింది. దీంతో హీరో నాగార్జున తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి మంగళవారం నాంపల్లి కోర్టుకు వచ్చారు.
నాగార్జున ఏం చెప్పారంటే?
ఈ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని హీరో నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబ పరువు, మర్యాదలకు నష్టం కలిగించాయని ఆయన కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. ఆమె రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు అన్ని న్యూస్ ఛానళ్లు, వార్తా పత్రికల్లో వచ్చాయని తెలిపారు. తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. నాగార్జున వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు రికార్డు చేసింది.
మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం హీరో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఇవాళ కుటుంబంతో సహా కోర్టుకు వచ్చిన నాగార్జున కోర్టుకు తన వాంగ్మూలాన్ని తెలిపారు.
కొండా సురేఖ ఏమన్నారంటే?
అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపు ఘాట్ వద్ద మంత్రి కొండా సురేఖ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున పిటిషన్‌లో వివరించారు. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరువు నష్టం దావా దాఖలు చేశారు.
'నాగచైతన్య డివోర్స్ 100 శాతం కేసీఆర్, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే.. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చవద్దు అంటే..సమంతను నా దగ్గరకు పంపాలని అని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేశారు. సమంతను వెళ్లమని చెప్పి నాగార్జున వాళ్లు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్లను అనింది. వెళ్లను అని చెబితే.. వింటే విను.. లేకపోతే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారు' అని కొండా సురేఖ వ్యాఖ్యానించినట్టు నాగార్జున తన పిటిషన్‌లో ప్రస్తావించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.