Nagarjuna Akkineni : కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. కోర్టుకెళ్లిన నాగార్జున
Nagarjuna Akkineni : సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై కొండా సురేఖ చేసిన కామెంట్స్.. ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు హీరో అక్కినేని నాగార్జున. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టుకెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. నాగ చైతన్య - సమత విడాకుల అంశంపై కొండా సురేఖ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్‌ను పరువు నష్టం దావా పిటిషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సినిమా, ఇతర రంగాల్లో అక్కినేని కుటుంబానికి ఉన్న మంచి పేరును నాగార్జున ప్రస్తావించారు. అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. బాపు ఘాట్ వద్ద మంత్రి కొండా సురేఖ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో వివరించారు. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరువు నష్టం దాఖలు చేశారు హీరో అక్కినేని నాగార్జున.
'నాగచైతన్య డివోర్స్ 100 శాతం కేసీఆర్, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే.. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చవద్దు అంటే..సమంతను నా దగ్గరకు పంపాలని అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంతను వెళ్లమని చెప్పి నాగార్జున వాళ్లు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్లను అనింది. వెళ్లను అని చెబితే.. వింటే విను.. లేకపోతే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారు' అని కొండా సురేఖ వ్యాఖ్యానించినట్టు పిటిషన్‌లో ప్రస్తావించారు.
కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ, రాజకీయ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కినేని అభిమానులు భగ్గుమన్నారు. ముఖ్యంగా మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంగోపాల్ వర్మ వంటి వాళ్లు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. చిరంజీవి వంటి పెద్ద హీరోలు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలంగాణ మేథావులు, సీనియర్ అధికారులు కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పెద్దఎత్తున విమర్శలు రావడంతో.. కొండా సురేఖ వివరణ ఇచ్చారు. 'ఆవేదనతోనే విమర్శలు చేశా. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను. నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు. పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి' అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
కొండా సురేఖ వివరణ ఇవ్వడంపై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. 'కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని.. ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే.. తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో వుండే అందరి కోసం.. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున, నాగచైతన్య చాలా సీరియస్‌గా తీసుకుని.. మరచిపోలేని గుణపాఠం నేర్పాలి' ఆర్జీవీ ట్వీట్ చేశారు.