KTR Legal Notice : 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు-brs ktr sends legal notices to konda surekha comments on phone tapping samantha divorce ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Legal Notice : 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

KTR Legal Notice : 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

Bandaru Satyaprasad HT Telugu
Oct 02, 2024 10:17 PM IST

KTR Legal Notice To Konda Surekha : మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, నాగ చైతన్య-సమంత విడాకుల వ్యవహారం ముడిపెడుతూ కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దీంతో కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు.

24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు
24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ టాపింగ్ చేశారంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణం అన్నారు. తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత- నాగచైతన్య పేర్లను ముడిపెడుతూ తనపై ఆరోపణలు చేశారని కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటున్నారన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరం అన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాల పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

మంత్రి హోదా మరిచి

ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయన్నారు. ఎలాంటి సాక్ష్యాదారాలు చూపించకుండా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులు అన్నారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

గతంలో ఇవే మాటలు మాట్లాడిన కొండా సురేఖకు నోటీసులు పంపించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారన్నారు. కొండా సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్దాలను తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టం చేయడానికి చేస్తున్నారన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు.

దీంతోపాటు ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడతానన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం