Balakrishna Blockbuster movie: బాలకృష్ణ నటించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీని ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారా?-balakrishna blockbuster movie kathanayakudu rejected by chiranjeevi krishna suman krishnam raju ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Blockbuster Movie: బాలకృష్ణ నటించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీని ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారా?

Balakrishna Blockbuster movie: బాలకృష్ణ నటించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీని ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారా?

Hari Prasad S HT Telugu

Balakrishna Blockbuster movie: బాలకృష్ణ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీని అంతకుముందు ఏకంగా ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారన్న విషయం మీకు తెలుసా? ఓ స్టార్ హీరో కోసం రాసుకున్న కథ.. చివరికి మరో హీరోను స్టార్ ను చేయడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏదంటే?

బాలకృష్ణ నటించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీని ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారా?

Balakrishna Blockbuster movie: బాలకృష్ణ ఈ మధ్యే సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలుసు కదా. అయితే అతని కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా 40 ఏళ్ల కిందట వచ్చింది. నిజానికి ఇది అతని కోసం రాసిన కథ కాదు. కానీ ఎంతో మంది రిజెక్ట్ చేసిన ఈ స్టోరీకి ఓకే చెప్పిన బాలయ్య బాబు మంచి హిట్ కొట్టడం విశేషం.

బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ఇదే

నందమూరి బాలకృష్ణ నటించిన ఆ సినిమా పేరు కథానాయకుడు. ఈ మూవీ 1984లో రిలీజైంది. బాలయ్యకు జంటగా విజయశాంతి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. అయితే ఈ స్టోరీని అంతకుముందు ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేసిన సంగతి చాలా మందికి తెలియదు.

నిజానికి ఈ సినిమాను చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని పరుచూరి బ్రదర్స్ రాసుకున్నారు. మూవీని డైరెక్ట్ చేసిన మురళీ మోహన్ రావు.. మొదట ఈ కథను మెగాస్టార్ కే వినిపించాడట. కానీ ఇందులో హీరో పాత్ర కంటే శారద నటించిన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత అనిపించడంతో చిరంజీవి నో చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

వీళ్లు కూడా వద్దన్నారు..

చిరంజీవి కోసం రాసిన కథను అతడే వద్దనడంతో డైరెక్టర్ మరికొందరు హీరోల దగ్గరికి వెళ్లాడు. ఇలా ఈ స్టోరీని కృష్ణ, సుమన్, కృష్ణం రాజు, రమేష్ బాబులాంటి వాళ్లకు కూడా చెప్పాడు. కానీ వాళ్లు కూడా మూవీ చేయడానికి అంగీకరించలేదు. దీంతో మొత్తానికే ఈ సినిమాను పక్కన పెట్టేయాలని డైరెక్టర్ మురళీ మోహన్ రావు నిర్ణయించుకున్నాడు.

అయితే అంతకుముందు చివరి ప్రయత్నంగా బాలకృష్ణకు కూడా ఈ కథ వినిపించాడు. ఈ కథ విన్న వెంటనే బాలయ్య సరే అన్నాడట. దీంతో మూవీ పట్టాలకెక్కింది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామా నాయుడు ఈ మూవీని తెరకెక్కించాడు. రిలీజైన తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించింది. ఈ సినిమాతో బాలయ్య కెరీర్ కూడా మలుపు తిరిగింది.

హిందీలోనూ రీమేక్ చేసినా..

తెలుగులో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమాను రెండేళ్ల తర్వాత అంటే 1986లో హిందీలోనూ రీమేక్ చేశారు. అక్కడ అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి, మీనాక్షి శెషాద్రి జంటగా దిల్‌వాలా పేరుతో మూవీ రిలీజైంది. అయితే అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించకపోవడంతో ఫ్లాప్ గా మిగిలిపోయింది.

సినిమా ఇండస్ట్రీలో ఒకరి కథను మరొకరు అనుకోకుండా సెలెక్ట్ చేసుకొని సక్సెస్ సాధించడం సహజమే. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్ లోనూ ఈ కథానాయకుడు అలాంటిదే. ఆ తర్వాత 40 ఏళ్లపాటు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగిన బాలయ్య.. ప్రస్తుతం తన 109వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.

మరోవైపు బాలకృష్ణ ఈ మధ్యే సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరైన చిరంజీవి.. బాలయ్యతో కలిసి ఓ ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఉందని చెప్పడం విశేషం.