Balakrishna: అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణనే.. ఓసారి గోవా వెళ్లినప్పుడు: తమ్మారెడ్డి భరద్వాజ
Tammareddy Bharadwaja Balakrishna In 50 Years Celebration: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా 50 ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తర్వాత ఇండియన్ సినిమాలో బాలకృష్ణనే అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ చేశారు.
Balakrishna 50 Years Film Celebration: కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్న విషయం తెలసిందే.
స్వర్ణోత్సవ పోస్టర్
బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఎఫ్‌ఎన్‌సీసీలో క్టరన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ ఇద్దరూ స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను లాంచ్ చేశారు.
రాజకీయాల్లో కూడా వారసుడిగా
ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. "మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మానాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారు" అని చెప్పారు.
సామాన్యుడిలా తిరుగుతారు
దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. "బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే ఇన్ని ఏళ్లు నటుడిగా చేసిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు" అని అన్నారు.
ఆయనే మోసుకొచ్చారు
"మేమిద్దరం ఒకసారి గోవా వెళ్లినప్పుడు ఒక ట్రే వాటర్ బాటిల్స్ కొని ఆయనే మోసుకొచ్చారు. అంత సింపుల్‌గా ఉంటారు. బాలయ్య నిర్మాతల మనిషి. నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి" అని తమ్మారెడ్డి భరద్వాజ కోరారు.
టాలీవుడ్ పవర్ ఏంటో
"రామారావు గారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం కలిసి టాలీవుడ్ పవర్ ఏంటో చూపించేలా గొప్పగా చేస్తాం" అని నిర్మాత చదలవాడ శ్రీనివార్ తెలిపారు.
అవినాభావ సంబంధాలు
"నందమూరి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలున్నాయి. మా సోదరుడు కైకాల సత్యనారాయణను రామారావుగారు సొంత తమ్ముడిలా చూసుకునేవారు. నిర్మాతలకు గౌరవం ఇవ్వడంలో అన్నగారి తర్వాత ఆయన వారసుడు బాలకృష్ణ కూడా ముందువరుసలో ఉంటారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని బాలయ్య నమ్ముతారు. అలాంటి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి" అని నిర్మాత కైకాల నాగేశ్వరరాను చెప్పారు.