Balakrishna Chiranjeevi: బాలయ్యతో ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉంది: మెగాస్టార్ కామెంట్స్ వైరల్-chiranjeevi says he wants to do a faction movie with balakrishna at nbk 50 years celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Chiranjeevi: బాలయ్యతో ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉంది: మెగాస్టార్ కామెంట్స్ వైరల్

Balakrishna Chiranjeevi: బాలయ్యతో ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉంది: మెగాస్టార్ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Sep 02, 2024 02:32 PM IST

Balakrishna Chiranjeevi: బాలయ్యతో కలిసి ఓ ఫ్యాక్షన్ సినిమాలో నటించాలని ఉన్నట్లు చెప్పాడు మెగా స్టార్ చిరంజీవి. బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకల సందర్భంగా చిరు ఈ కామెంట్స్ చేయడం విశేషం. ఈ వేడుక ఆదివారం (సెప్టెంబర్ 1) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

బాలయ్యతో ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉంది: మెగాస్టార్ కామెంట్స్ వైరల్
బాలయ్యతో ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉంది: మెగాస్టార్ కామెంట్స్ వైరల్

Balakrishna Chiranjeevi: బాలయ్య బాబు ఓ నటుడిగా కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ కు హాజరైన టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలయ్యతో ఓ ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఉన్నట్లు చెప్పాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది స్టార్లు ఈ వేడుకకు హాజరయ్యారు.

బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమాకు నేను రెడీ

బాలకృష్ణ 1974లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో చిరంజీవితోపాటు వెంకటేశ్, శ్రీకాంత్, రానా, నాని, గోపీచంద్, శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాఘవేంద్ర రావు, బీ గోపాల్, పరుచూరి బ్రదర్స్, సిద్దూ జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్లాంటి వాళ్లంతా హాజరయ్యారు.

వాళ్లందరి ముందు చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "నేను చేసిన ఇంద్రసేనా రెడ్డి పాత్రకు ఒక రకంగా సమరసింహారెడ్డే ప్రేరణ. నిజానికి ఆ పాత్ర చేసే ముందు నేను కాస్త జంకాను. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో బాలయ్యలాగే ఎవరూ ఉండరేమో అనిపించింది.

కానీ కథ నచ్చాక నేను సవాలుగా తీసుకున్నాను. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇంద్రసేనా రెడ్డి వర్సెస్ సమరసింహా రెడ్డి అనే మూవీ తీస్తా అంటే నేను రెడీ.. మరి బాలయ్య మీరు రెడీనా' అని చిరు అనగా.. బాలయ్య కూడా నేను రెడీ అని అన్నాడు. దీంతో హాల్లో ఉన్న ఫ్యాన్స్ అందరూ పెద్ద ఎత్తున అరిచారు.

ఇది తెలుగు సినిమా వేడుక

బాలయ్య బాబు 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చిరు అన్నాడు. "బాలయ్య బాబు 50 ఏళ్ల సెలబ్రేషన్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దీనిని కేవలం బాలయ్య కోసమే కాకుండా మొత్తం తెలుగు సినిమా వేడుకగా నేను భావిస్తున్నాను. బాలయ్యకు ఓ అరుదైన రికార్డు ఉంది. తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య నిరూపించుకున్నాడు" అని చిరు అన్నాడు.

"కొన్నిసార్లు మా అభిమానులు పోట్లాడుకునే వాళ్లు. మేము వాళ్ల కోసం కలిసి కొన్ని వేడుకలు చేసే వాళ్లం. మా మధ్య మంచి బంధం ఉందని చెప్పడానికి ఇలా చేసేవాళ్లం. ఆ తర్వాత ఫ్యాన్స్ కూడా ఒక్కటయ్యారు. మా ఇంట్లో ఏ వేడుక జరిగినా బాలయ్య లేకపోతే అది పూర్తి కాదు. బాలయ్యకు 100 ఏళ్లయినా ఇదే ఎనర్జీ ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను" అని చిరంజీవి అన్నాడు.