Hero Nagarjuna Petition : పరువు నష్టం దావా కేసు, హీరో నాగార్జున వాంగ్మూలం రికార్డు చేయాలన్న కోర్టు
Hero Nagarjuna Petition : మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో హీరో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో ఆయన రేపు కోర్టుకు హాజరు కానున్నారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం హీరో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ కేసులో తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. తన వాంగ్మూలం ఇచ్చేందుకు నాగార్జున రేపు కోర్టుకు హాజరు కానున్నారు.
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
మంత్రి కొండా సురేఖ... మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో హీరో నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో... సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మంత్రి సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు. హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.
నాగార్జున పరువు నష్టం దావా
తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున తన పిటిషన్ లో పేర్కొన్నారు. తన కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలతో తమ కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా తమ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున గత గురువారం నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు.
కొండా సురేఖ ఏమన్నారంటే?
అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపు ఘాట్ వద్ద మంత్రి కొండా సురేఖ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున పిటిషన్లో వివరించారు. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరువు నష్టం దావా దాఖలు చేశారు.
'నాగచైతన్య డివోర్స్ 100 శాతం కేసీఆర్, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే.. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చవద్దు అంటే..సమంతను నా దగ్గరకు పంపాలని అని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేశారు. సమంతను వెళ్లమని చెప్పి నాగార్జున వాళ్లు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్లను అనింది. వెళ్లను అని చెబితే.. వింటే విను.. లేకపోతే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారు' అని కొండా సురేఖ వ్యాఖ్యానించినట్టు నాగార్జున తన పిటిషన్లో ప్రస్తావించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం